మహారాష్ట్ర 'మహా' టెన్షన్ పెట్టేస్తోందిగా..!
Maharashtra Covid Cases. మహారాష్ట్ర లో కరోనా కేసులు ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించి కరోనా ఎక్కువయింది
By Medi Samrat Published on 30 March 2021 7:15 AM GMTభారతదేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఉధృతమవుతోంది. అందుకు ముఖ్య కారణం మహారాష్ట్రలో విపరీతంగా పెరిగిపోతున్న కరోనా కేసులేనని అంటూ ఉన్నారు. దేశంలో చాలా తక్కువ కరోనా కేసులు నమోదవుతున్న సమయంలో ఒక్కసారిగా మాహారాష్ట్రలో కరోనా కేసులు పెరగడం మొదలైంది. అధికారులు మొదట కాస్త అలసత్వం ప్రదర్శించడంతో కరోనా ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించింది. కరోనా కొత్త వేరియంట్లు కూడా తోడవడంతో మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నాడు 31,643 కొత్త కేసులు వచ్చాయి. ఆదివారం నాడు 40,414 కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27.45 లక్షలను దాటింది. ఇప్పటివరకూ మొత్తం 54 వేల మందికి పైగా మరణించారు.
ఇక ముంబై పురపాలక అధికారులు కరోనా కట్టడికి చర్యలు తీసుకోవడమే కాకుండా.. కరోనా సోకిన వారికి చికిత్స అందించడానికి పలు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. అన్ని ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్ లలో లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ వచ్చిన వారికి బెడ్లను కేటాయించ వద్దని ఆదేశాలు జారీ చేశారు. కేవలం తీవ్రమైన లక్షణాలు ఉండి, అవసరమైన వారికి మాత్రమే ఆసుపత్రి పడకలు కేటాయించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే లక్షణాలు లేకుండా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని సాధ్యమైనంత త్వరగా డిశ్చార్జ్ చేయాలని, తీవ్రమైన లక్షణాలతో వచ్చే వారికి అవసరమైన బెడ్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
ఆదివారం నాడు ముంబైలో మరో 6,923 కరోనా కేసులు వచ్చాయి.. సోమవారం నాడు మరో 5,888 కొత్త కేసులు వచ్చాయి. దీంతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు, అన్ని ఆసుపత్రుల్లో సాధ్యమైనన్ని ఎక్కువ పడకలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో పాటు ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే, ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ ప్రదీప్ వ్యాస్ తదితరులు హాజరయ్యారు. ఆసుపత్రుల్లో పడకలతో పాటు ఆక్సిజన్ సరఫరా, వెంటిలేటర్లు తదితరాలపై దృష్టిని సారించాలని, కేసుల సంఖ్య మరింతగా పెరిగితే తీసుకోవాల్సిన తదుపరి చర్యలపైనా నివేదిక ఇవ్వాలని సీఎం కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 80 శాతం, ప్రైవేటు ఆసుపత్రుల్లో 100 శాతం ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.