'మహా' మంత్రివర్గ విస్తరణ.. షిండే దోస్తులకు దక్కని పదవులు..!
మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణలో పలువురు సీనియర్ నేతలకు నిరాశే మిగిలింది.
By Kalasani Durgapraveen Published on 15 Dec 2024 3:31 PM GMTమహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణలో పలువురు సీనియర్ నేతలకు నిరాశే మిగిలింది. సామాజిక, ప్రాంతీయ సమతుల్యతతో చాలా మంది కొత్త ముఖాలు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నాయి. ఈరోజు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కేబినెట్‌లో 39 మంది ప్రమాణం చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాకూటమి భారీ మెజారిటీ సాధించడంతో డిసెంబర్ 5న బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా.. ఉప ముఖ్యమంత్రులుగా మాజీ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. 10 రోజుల తర్వాత ఆదివారం రాష్ట్ర రాజధాని నాగ్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో 39 మంది కొత్త మంత్రులతో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు. వీరిలో 33 మంది కేబినెట్ మంత్రులు, ఆరుగురు రాష్ట్ర మంత్రులు ఉన్నారు.
సంఖ్యాబలం ఆధారంగా బీజేపీకి చెందిన 19 మంది, శివసేనకు చెందిన 11 మంది, ఎన్సీపీకి చెందిన 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులతో కలిపి రాష్ట్ర మంత్రివర్గంలో మొత్తం మంత్రుల సంఖ్య 42కి చేరుకుంది. నాగ్‌పూర్‌లో రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక రోజు ముందు ఈ మంత్రివర్గ విస్తరణ జరిగింది.
ఈరోజు జరిగిన మంత్రివర్గ విస్తరణలో ప్రభుత్వంలోని మూడు పార్టీలు తమ సీనియర్ నేతలను కొంత మందిని తొలగించాయి. ఇందులో అజిత్ పవార్ ఎన్‌సిపి నుండి ఛగన్ భుజబల్, భారతీయ జనతా పార్టీ నుండి సుధీర్ ముంగంటివార్, శివసేన నుండి అబ్దుల్ సత్తార్, దీపక్ కేసర్కర్ పేర్లు ఉన్నాయి.
ఛగన్ భుజ్బల్ NCP సీనియర్ నాయకుడు మాత్రమే కాదు.. మహారాష్ట్రలోని వెనుకబడిన తరగతుల (OBC) సీనియర్ మోస్ట్ నాయకుడిగా పేరుంది. అలాగే సుధీర్ ముంగంటివార్ బీజేపీ సీనియర్ నాయకుడు. 2014 నాటి ఫడ్నవీస్ ప్రభుత్వం, 2022 షిండే ప్రభుత్వంతో సహా 1995లో తొలిసారిగా ఏర్పడిన శివసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. కాగా అబ్దుల్ సత్తార్, దీపక్ కేసర్కర్‌లు ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు సన్నిహితులు. ఈసారి ఇద్దరికీ పదవులు రాలేదు.
కొత్త మంత్రివర్గంలో నలుగురు మహిళా సభ్యులు కూడా ఉన్నారు. వీరిలో గతంలో మంత్రులుగా పనిచేసిన పంకజా ముండే, అదితి తత్కరే, తొలిసారిగా మంత్రులుగా ప్రమాణం చేసిన మాధురీ మిసాల్, మేఘనా బోర్దికర్ ఉన్నారు. ఈ కేబినెట్‌లో బీజేపీ నుంచి పంకజా ముండే, ఎన్సీపీ కోటా నుంచి ఆమె బంధువు ధనంజయ్ ముండేలకు మంత్రి పదవులు దక్కింది.
పంకజా ముండే ప్రముఖ రాష్ట్ర బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే కుమార్తె. 19 మంది కొత్త ముఖాలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మంత్రివర్గ విస్తరణకు ముందు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈరోజు నాగ్‌పూర్‌లో రోడ్ షో నిర్వహించారు. నాగ్‌పూర్‌లోని నైరుతి నాగ్‌పూర్ స్థానం నుంచి ఆయన ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.