మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. ఉన్నట్లుండి గిర్డర్ యంత్రం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఏకంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
మహారాష్ట్రలోని థానే జిల్లా షాపూర్‌లో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది ఈ సంఘటన. సమృధ్ధి ఎక్స్‌ప్రెస్ హైవే ఫేస్-3 రోడ్డు పనుల్లో భాగంగా బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన గిర్డర్ యంత్రం ఒక్కసారిగా కుప్పకూలింది. అక్కడున్న కార్మికులపై పడిపోయింది. పిల్లర్లతో అనుసంధానిస్తుండగా గిర్డర్ యంత్రం కుప్పకూలింది. భారీ యంత్రం కులడంతో ఘటనాస్థలిలోనే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 100 అడుగుల ఎత్తు నుంచి ఈ యంత్రం పడిపోయినట్లు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా శిథిలాల కింద ఇరుక్కున్న పలువురిని బయటకు తీశారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి.. మృతదేహాలను మార్చురీకి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ భీకర వాతావరణం ఏర్పడింది. మృతుల కుటుంబాలు రోదిస్తున్నాయి. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.