భర్తలను ఇంట్లోనే మద్యం తాగమని చెప్పండి.. మంత్రి సంచలన కామెంట్స్
మద్యం గురించి మధ్యప్రదేశ్ మంత్రి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
By Srikanth Gundamalla
భర్తలను ఇంట్లోనే మద్యం తాగమని చెప్పండి.. మంత్రి సంచలన కామెంట్స్
మద్యం గురించి మధ్యప్రదేశ్ మంత్రి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. మద్యానికి అలవాటైన మగవారిని ఎలా మాన్పించాలో చెప్పే క్రమంలో వివాదాస్పద కామెంట్స్ చేశారు మంత్రి నారాయణ్ సింగ్ కుష్వాహా. ఆయన వింత సూచనల ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆయన చెప్పిన దాన్ని కొందరు స్వాగతిస్తుంటే.. ఇంకొందరు విమర్శలు చేస్తున్నారు.
మధ్యప్రదేశ్ మంత్రి నారాయణ్ సింగ్ శుక్రవారం బోపాల్‌లో మాదక ద్రవ్యాలు, మద్యం సహా ఇతర దురలవాట్లపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో పాల్గొన్న ఆయన.. ఈ సంచలన కామెంట్స్ చేశారు. భర్తలు మద్యానికి అలవాటు పడితే.. వారిని మాన్పించేందుకు ఇళ్లలోనే మద్యం సేవించమని చెప్పాలని మహిళలకు ఆయన సూచించారు. కుటుంబ సభ్యుల ముందు మద్యం సేవించడానికి వారికి నామోషీగా అనిపిస్తుందని చెప్పారు. అలా క్రమక్రమంగా మద్యానికి దూరం అవుతారని చెప్పారు. అలాగే ఇంట్లో భర్తలు మద్యం తాగుతున్నప్పుడు తండ్రినే పిల్లలు అనుసరిస్తారనీ.. వారు కూడా ప్రమాదంలో పడతారని హెచ్చరించాలని మహిళలకు సూచించారు మంత్రి నారాయణ్ సింగ్. ఈ పద్ధతి ఆచరణాత్మకని.. దాంతో.. పురుషులు మద్యం అలవాటు నుంచి దూరం అవుతారని అబిప్రాయపడ్డారు.
అయితే.. మంత్రి నారాయణ్‌సింగ్ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. దాంతో కాంగ్రెస్ రంగంలోకి దిగింది. నారాయణ్ సింగ్ ఉద్దేశం మంచిదే అయినా.. సలహా మాత్రం సబబుగా లేదని చెప్పింది. పురుషులు ఇళ్లలో మద్యం తాగడం మొదలుపెడితే భార్యలతో గొడవలు పెరుగుతాయని పలువురు అంటున్నారు. చివరకు ఇది గృహ హింస దాకా దారి తీసే చాన్స్ ఉందని చెప్పారు. ఇందుకు బదులు ఆ అలవాటుని పురుషులు తమంతట తామే మానుకోవడం మంచిదని కాంగ్రెస్ పార్టీ మీడియా శాఖ అధ్యక్షుడు ముఖేశ్ నాయక్ అన్నారు.