కూలీకి దొరికిన రూ.1.5 కోట్ల విలువైన డైమండ్
వజ్రాలు చాలా విలువైనవి ఇది అందరికీ తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 13 Sep 2024 1:00 PM GMTవజ్రాలు చాలా విలువైనవి ఇది అందరికీ తెలిసిందే. కొన్ని సార్లు అదృష్టం వరించి భూముల్లో వజ్రాలు దొరకుతుంటాయి. తాజాగా ఓ కూలీని వరించింది అదృష్టం. అతనికి ఏకంగా రూ.1.5 కోట్లువిలువ చేసే వజ్రం దొరికింది. దాంతో అతను ఓవర్‌నైట్‌లో లక్షాదికారి అయ్యాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని పన్నాలో చోటుచేసుకుంది. స్వామిదిన్ ఆపల్ అనే కూలీ.. మరో ముగ్గురితో కలిసి 2024లో మేలో సర్కోహా అనే గ్రామంలో ఓ గినిని లీజుకు తీసుకున్నాడు. అక్కడ స్వామిదిన్ కు గురువారం 32.80 క్యారెట్ల వజ్రం దొరికింది. ఈ వజ్రం విలువ కోటిన్నర రూపాయల విలువ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దాంతో..స్వామిదిన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
తనకు వజ్రం దొరకడంపై స్వామిదిన్ మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశాడు. పన్నా జిల్లాలోని నారంగి బాగ్‌కు చెందిన ఇతను.. వజ్రాన్ని డైమండ్ ఆఫీసులో డిపాజిట్ చేశాడు. ఈ వజ్రం లభించడం తన తలరాతను మార్చిందన్నాడు. నలుగురు భాగస్వాములం డైమండ్ వేలంలో వచ్చిన డబ్బుని సమానంగా పంచుకుంటామని చెప్పాడు. ఈ వజ్రం ద్వారా వచ్చే డబ్బును పిల్లల కోసం ఇళ్లు కట్టిస్తానని చెప్పాడు. మరోవైపు పన్నాలో ఒక్కరోజులోనే చాలా మంది అదృష్టం మారిపోయిందని కలెక్టర్ సురేశ్ కుమార్ చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 16 వజ్రాలు దొరికాయని చెప్పారు. స్వామిదిన్‌కు దొరికిన వజ్రాన్ని పన్నా డైమండ్ ఆఫీసులో డిపాజిట్ చేశారని చెప్పారు. త్వరలోనే వేలం ద్వారా విక్రయిస్తామని చెప్పారు.