మధ్యప్రదేశ్ సీఎం తొలిరోజే సంచలన నిర్ణయం, కఠిన ఆదేశాలు జారీ
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజే సంచలన నిర్ణయాలు తీసుకుంది మధ్యప్రదేశ్ సర్కార్.
By Srikanth Gundamalla Published on 14 Dec 2023 9:00 AM ISTమధ్యప్రదేశ్ సీఎం తొలిరోజే సంచలన నిర్ణయం, కఠిన ఆదేశాలు జారీ
మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వ ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజే సంచలన నిర్ణయాలు తీసుకుంది మధ్యప్రదేశ్ సర్కార్. బహిరంగ ప్రదేశాల్లో మాంసం, గుడ్ల విక్రయాలపై నిషేధం విధించింది. ఆహార భద్రతా నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించనున్నట్లు వెల్లడించింది. బహిరంగ ప్రదేశాల్లో మాంసం, గుడ్లు విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది.
అయితే.. జనాల్లో సరైన అవగాహన కల్పించిన తర్వాతే ఈ మేరకు చర్యలు తీసుకుంటామని మోహన్ యాదవ్ ప్రభుత్వం పేర్కొంది. తొలిసారి జరిగిన కేబినెట్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం మోహన్ యాదవ్. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. ఫుడ్ డిపార్ట్‌మెంట్, పోలీస్ డిపార్ట్‌మెంట్, స్థానిక పట్టణ సంస్థల అధికారులు ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని సీఎం మోహన్ యాదవ్ సూచించారు. డిసెంబర్ 15 నుంచి 31వ తేదీ మధ్య బహిరంగ ప్రదేశాల్లో మాంసం, గుడ్ల విక్రయంపై నిషేధం అమలు అవుతుందని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు.
ఇవే కాదు.. మరిన్ని నిర్ణయాలను కూడా మధ్యప్రదేశ్ కేబినెట్ తీసుకుంది. ప్రతి జిల్లాలో యువత కోసం ఒక ఎక్స్‌లెన్స్ కాలేజ్‌ను నిర్మిస్తామని చెప్పింది. దీనిని ప్రధానమంత్రి ఎక్స్‌లెన్స్ కాలేజ్‌గా పిలుస్తామని తెలిపారు. ఇందు కోసం 52 కాలేజీలను ఎంపిక చేశామని మధ్యప్రదేశ్ సర్కార్ వెల్లడించింది. డిగ్రీ మార్క్స్ షీట్‌ల కోసం విద్యార్థులు ఆందోళన పడుతున్నారనీ.. వీటికి పరిష్కారంగా కాలేజీలు, యూనివర్సిటీల్లో డీజీ లాకర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. తరచూ నేరాలకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకునేందకు హోంశాఖతోనూ మాట్లాడారు సీఎం మోహన్ యాదవ్. అలాగే ధ్వని పరికరాలను నియంత్రించనున్నట్లు ప్రకటించారు. ఎవరైనా మతపరమైన ప్రదేశంలో పరిమితులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సూచించారు.