అందుకే మహాకాల్ ఆలయంలో అగ్నిప్రమాదం జరిగింది: మంత్రి కైలాస్
ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయంలో హోలీ సందర్భంగా వేడుకలు జరుగుతుండగా అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 25 March 2024 9:15 AM GMTఅందుకే మహాకాల్ ఆలయంలో అగ్నిప్రమాదం జరిగింది: మంత్రి కైలాస్
ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయంలో సోమవారం ఉదయం హోలీ సందర్భంగా వేడుకలు జరుగుతుండగా అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంలో 14 మంది ఆలయ పూజారులకు గాయాలు అయ్యాయి. అయితే.. గర్భగుడిలో హోలీ ఆడుతున్న సందర్భంగానే ఈ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై మధ్యప్రదేశ్ మంత్రి కైలాస్ విజయవర్గీస్ మాట్లాడారు. ప్రమాదం జరగడానికి గల కారణాలపై అంచనా తెలిపారు.
ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయంలో ప్రతి ఏడాది మహాకాలేశ్వరుడి సన్నిధిలో పూజాలు హోలీ వేడుక జరుపుతారు. ఇందులో భాగంగానే సోమవారం కూడా హోలీ వేళ తెల్లవారుజామున 5.50 గంటలకు భస్మహారతి ఇచ్చే సమయంలో వేడుకలు జరిపారు. ఈ సమయంలోనే మంటలు చెలరేగాయి. దాంతో.. ఈ మంటల్లో 14 మంది పూజారులు గాయపడ్డారు. ఇవే మంటల్లో మరింకొందరు సేవలకు కూడా గాయాలు అయ్యాయి. ఇక గాయపడ్డవారిని వెంటనే ఇండోర్‌లోని అరబిందో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడికల్ సైన్స్ ఆస్పత్రిలో చేర్పించారు. వారు చికిత్స పొందుతున్నట్లు వైద్యులు చెప్పారు.
ఈ సంఘటనలో గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నామనీ.. 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంచాలనీ వైద్యులు చెప్పారని మంత్రి కైలాస్ విజయవర్గీయ్ చెప్పారు. ఇక ఈ ప్రమాదం గులాల్ రంగులో ఉన్న కెమికల్స్ వల్ల జరిగి ఉంటుందని ఆయన అంచనా వేశారు. ఈ ప్రమాదం గురించి ఎవరూ అనుమానాలు పెట్టుకోవద్దని చెప్పారు. అనుకోకుండా జరిగిన ప్రమాదమే అని పేర్కొన్నారు. మహాకాలేశ్వర్ ఆలయంలో హోలీ వేడుకలను నిర్వహించే సంప్రదాయాన్ని తాము ఆపబోము అని మంత్రి కైలాస్ వివరించారు. ఇకముందు గులాల్‌లో కెమికల్స్ లేకుండా చూసుకుంటామనీ.. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూస్తామని మంత్రి కైలాస్ చెప్పారు.