Video: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బీజేపీ నేత మాధవీలత దుర్గా పారాయణం
హైదరాబాద్ మాజీ ఎంపీ అభ్యర్థిని మాధవీలత తాజాగా తన ఎక్స్ (X) ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు.
By - అంజి |
Video: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బీజేపీ నేత మాధవీలత దుర్గా పారాయణం
హైదరాబాద్ మాజీ ఎంపీ అభ్యర్థిని మాధవీలత తాజాగా తన ఎక్స్ (X) ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని మహిళా ప్రార్థనా మందిరంలో ఆమె నేలపై కూర్చుని "దుర్గా సూక్తం" పఠిస్తూ ఈ వీడియోలో కనిపిస్తారు. అయితే, ఆమె ప్రార్థన చేస్తున్న సమయంలో అక్కడ బురఖా ధరించిన కొందరు ముస్లిం మహిళలు కూడా ఉండటం, కెమెరా పర్సన్ ఆమెను అనుసరిస్తూ వీడియో తీయడం ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువైంది.
ఈ వీడియోపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రార్థనా మందిరాలు నిశ్శబ్దంగా ధ్యానం చేసుకోవడానికి ఉద్దేశించినవని, అక్కడ గట్టిగా శ్లోకాలు పఠించడం, వీడియోలు తీయడం నిబంధనలకు విరుద్ధమని విమర్శకులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మహమ్మద్ వసీం స్పందిస్తూ.. "నిశ్శబ్దంగా ఉండాల్సిన చోట శబ్దంతో ప్రార్థన చేస్తూ ఇతరులకు అసౌకర్యం కలిగిస్తున్నారని" పేర్కొన్నారు. విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మరియు ఏఏఐ (AAI) దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మరికొందరు ఇది కావాలని ఇతరులను రెచ్చగొట్టడానికి చేసిన ప్రయత్నమని ఆరోపిస్తున్నారు.
మరోవైపు మాధవీలత తన పోస్ట్‌లో ఇది ఆధ్యాత్మిక అనుభూతి అని పేర్కొన్నారు. "భారతదేశం ఇలాంటి పవిత్ర స్థలాలను కల్పించడం మన ప్రాచీన విలువలకి నిదర్శనం.. లోక కల్యాణం కోసం నేను దుర్గా సూక్తాన్ని పఠించాను" అని ఆమె రాశారు. ఆమె మద్దతుదారులు కూడా ఆమెను వెనకేసుకొస్తున్నారు. హిందూ ప్రార్థనలు చేయడం రెచ్చగొట్టడం ఎలా అవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో ప్రార్థనా మందిరాలు కేవలం నమాజ్ గదులుగానే ఉండేవని, ఇప్పుడు హిందువులు కూడా తమ ఉనికిని చాటుకుంటున్నారని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
గతంలో 2024 ఎన్నికల సమయంలో మసీదు వైపు బాణం వేసినట్లు సంజ్ఞ చేయడం, పోలింగ్ కేంద్రం వద్ద ముస్లిం మహిళల గుర్తింపు కార్డులను తనిఖీ చేయడం వంటి ఘటనలతో మాధవీలత వార్తల్లో నిలిచారు. తాజాగా ఎయిర్‌పోర్ట్ వీడియో కూడా అదే తరహాలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది.
A moment of stillness amidst the rush - Pranams to the Divine in the Heart of BharatIn the pursuit of Loka Kalyan (the well-being of the world), one must first find inner alignment. At the Delhi Airport prayer room, I immersed myself in the celestial verses of the Durgā Sūktam,… pic.twitter.com/z8fmJT0JQx
— Kompella Madhavi Latha (@Kompella_MLatha) March 23, 2026