ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన 23 ఏళ్ల యువతి గత 7 నెలలుగా అపస్మారక స్థితిలో ఉంది. రోడ్డు ప్రమాదంలో తలకు గాయమై, పలుమార్లు శస్త్ర చికిత్సలు చేయించుకున్న మహిళ అపస్మారక స్థితిలో పడి ఉంది. అయితే ఇది ఆశ్చర్యమో లేక దేవుడి సంకల్పమో తెలియదు కానీ.. ఈ మహిళ గత వారం ఎయిమ్స్‌లో ఆరోగ్యవంతమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో మహిళ తన భర్తతో కలిసి బైక్‌పై వెళ్తోంది. ఆమె ప్రమాద సమయంలో హెల్మెట్ ధరించలేదు. ఈ ఘటన ఈ ఏడాది మార్చి 31న జరిగింది.
ఈ ప్రమాదంలో మహిళ తలకు బలమైన గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో ఆమె ప్రాణాలను కాపాడినప్పటికీ, ఆమె అపస్మారక స్థితిలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. న్యూరోసర్జరీ ప్రొఫెసర్ దీపక్ గుప్తా ప్రకారం.. ''ఆమె కళ్లు తెరిచి చూసింది. కానీ ఆమె దేన్నీ అర్థం చేసుకోలేని లేదా స్పందించే స్థితిలో లేదు. హెల్మెట్ ధరించి ఉంటే ఆమె జీవితం మరోలా ఉండేది. బహుశా ఆమె ఇప్పుడు బాగుండేవాడని'' అని చెప్పారు. మహిళ భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కానీ ఈ ప్రమాదం తర్వాత అతను తన భార్యను చూసుకోవడానికి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు.
యాక్సిడెంట్ తర్వాత ఎయిమ్స్‌కు తీసుకొచ్చినప్పుడు మహిళ 40 రోజుల గర్భిణి. అప్పుడు కడుపులోపల శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యుడు గుర్తించారు. ఆమె భర్త బిడ్డను ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం తల్లి అపస్మారక స్థితిలో ఉండడంతో బిడ్డకు పాలివ్వలేకపోయింది. శిశువుకు సీసా నుండి పాలు తాగిస్తున్నారు.