ఆస్పత్రిలో అర్ధరాత్రి యువకుల హల్‌చల్‌.. వాటితో కొట్టుకుంటూ ఎంజాయ్‌

Lucknow Hospital employee birthday hitting with belts video. ఆస్పత్రిలో అర్ధరాత్రి బర్త్‌ డే వేడుకలు నిర్వహించి కొందరు యువకులు హల్‌చల్‌ చేశారు. బర్త్‌ డే బాయ్‌ని స్నేహితులు

By అంజి  Published on  8 Aug 2022 3:59 PM IST
ఆస్పత్రిలో అర్ధరాత్రి యువకుల హల్‌చల్‌.. వాటితో కొట్టుకుంటూ ఎంజాయ్‌

ఆస్పత్రిలో అర్ధరాత్రి బర్త్‌ డే వేడుకలు నిర్వహించి కొందరు యువకులు హల్‌చల్‌ చేశారు. బర్త్‌ డే బాయ్‌ని స్నేహితులు బెల్టుతో కొట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ లక్నోలోని హజ్రత్‌గంజ్‌లో గల డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ ఆస్పత్రిలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పుట్టిన రోజు జరుపుకుంటున్న యువకుడు ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఫార్మసీలో పని చేసే అతడి ఫ్రెండ్స్‌ కేక్‌ కట్‌ చేసిన తర్వాత ఒకరినొకరు బెల్టులతో కొట్టడం వీడియోలో కనిపించింది. ఎమర్జెన్సీ విభాగాలు పక్కనే ఉన్నా.. యువకులంతా ఇలా అల్లరి చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆదివారం సివిల్ ఆసుపత్రి ఆవరణలో ఒకరినొకరు బెల్టులతో కొట్టుకుంటున్న వీడియో బయటపడిందని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ ఓజాన్ తెలిపారు. ''ఇందులో ఆసుపత్రి సిబ్బంది రాత్రిపూట పార్టీ చేసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న గార్డుల నుండి అత్యవసర, ఓపీడీ సిబ్బంది వరకు కూడా ఈ వీడియోలో కనిపించారు. బర్త్ డే కేక్ కట్ చేసిన తర్వాత ఒకరినొకరు బెల్టులతో కొట్టుకోవడం కనిపించింది. రాత్రి 12 గంటల సమయంలో ఆస్పత్రిలోని ఓపీడీలో ఈ పార్టీ జరిగింది. ఇది తీవ్రమైన విషయం. ఈ కేసులో దోషులుగా తేలిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటాం. సోమవారం ఈ వీడియోలో కనిపించిన ఇంటర్న్ ఉద్యోగులందరి నుండి వివరణ కోరాం'' అని ఆనంద్‌ ఓజాన్‌ చెప్పారు.

ఈ విషయమై డిప్యూటీ సీఎం, ఆరోగ్యశాఖ మంత్రి బ్రజేష్‌ పాఠక్‌ మాట్లాడుతూ.. సివిల్‌ ఆస్పత్రిలో యువకులు హల్‌చల్‌ చేసిన వీడియోలు తన దృష్టికి వచ్చాయన్నారు. దీని విచారణను లక్నో విభాగానికి అప్పగించామని, రెండు రోజుల్లో నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. విచారణలో ఎవరు తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Next Story