ఆ ఇంట్లోని కిచెన్ గది భారత్‌లో ఉంటే పడక గది మయన్మార్‌లో ఉంది. మీకు ఇది వినడానికి విచిత్రంగా అనిపించొచ్చు. కానీ మీరు విన్నది నిజమే. భారత్, మయన్మార్ దేశాల బార్డర్ లైన్ ఓ ఇంటి మధ్యలో నుంచి వెళ్లింది. దీంతో వాళ్ల ఇంటి కిచెన్ భారత్‌లోకి, బెడ్రూమ్ మయన్మార్‌లోకి వెళ్లింది. దీంతో ఆ ఇంట్లోని వారు భారత్‌లో భోజనం చేస్తూ, మయన్మార్‌లో నిద్రపోతున్నారు. మనం ఇంత సేపు మాట్లాడుకుంటున్న ఈ ఇల్లు ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లోని మన్ జిల్లాలో లోంగ్వా గ్రామంలో ఉంది.
ఈ గ్రామంలోని చాలా మంది ఇళ్లలోంచి రెండు దేశాల సరిహద్దు రేఖ వెళ్లింది. కొణ్యక్ గిరిజన తెగకు చెందిన ప్రజలు జీవించే ఈ గ్రామం రెండు దేశాల కిందకు వస్తుంది. వీరికి రెండు దేశాల సిటిజన్‌షిప్ కూడా ఉంది. తమకు భారత్‌కు, మయన్మార్‌కు పెద్ద తేడా ఏమీ లేదని లోంగ్వా గ్రామ ప్రజలు చెబుతుంటారు. ఇక్కడి యువకులు కొందరు భారత్‌లో వ్యాపారం చేస్తుంటే.. మరికొందరు మయన్మార్ సైన్మంలో పని చేస్తున్నారు.
లోంగ్వా గ్రామంలోని కొణ్యక్ గిరిజన తెగకు అతి పెద్ద చరిత్ర ఉంది. భారత్‌లో అతి పురాతనమైన హెడ్ హంటర్స్‌గా ఈ తెగవారిని పేర్కొంటారు. కొన్ని దశాబ్దాల కిందటి వరకూ తమ శత్రువులుగా భావించే ఇతర గిరిజన తెగ ప్రజల తలలను నరికి తీసుకురావడం వీరి సంప్రదాయంగా ఉండేది. అలా తలలు నరికి తీసుకొచ్చినందుకు వారి ఒంటిపై పచ్చబొట్టు వేసి సంబరాలు చేసుకునేవారు. కాలం మారుతున్న కొద్ది కొణ్యక్ తెగ ప్రజలు కూడా మారిపోయారు.