మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూకేటాయింపుల కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ముడా ద్వారా అక్రమాలు చేశారనే ఆరోపణలపై సిద్ధరామయ్యపై లోకాయుక్త పోలీసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఆదేశించిన రెండు రోజుల తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎఫ్‌ఐఆర్‌లో సిద్ధరామయ్యను మొదటి ముద్దాయిగా పేర్కొన్నారు.
ఆరోపణల ప్రకారం, మైసూరు అభివృద్ధి సంస్థ పార్వతికి చెందిన భూమిని స్వాధీనం చేసుకుంది. ఆమెకు ఎక్కువ విలువైన ప్లాట్లతో పరిహారం ఇచ్చింది. దీంతో బీజేపీ నేతృత్వంలోని ప్రతిపక్షం, కొంతమంది కార్యకర్తలు సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి ఈ చట్టవిరుద్ధమైన భూమి ఒప్పందం నుండి లబ్ది పొందారని ఆరోపించారు. ఈ అక్రమాల విలువ రూ. 4,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఆగస్టులో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఈ నెల ప్రారంభంలో, కర్ణాటక హైకోర్టు గవర్నర్ అనుమతిని సమర్థించింది.