కలిసి పోటీ చేసేందుకు 'INDIA' కూటమి తీర్మానం
లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇండియా కూటమిలోని పార్టీలు తీర్మానం చేశాయి.
By Srikanth Gundamalla Published on 1 Sept 2023 4:34 PM ISTకలిసి పోటీ చేసేందుకు 'INDIA' కూటమి తీర్మానం
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఓడించాలనే లక్ష్యంతో ప్రతిపక్ష పార్టీలన్నీ ఇండియా కూటమిగా ఏకమయ్యాయి. 28 పార్టీలకు చెందిన అగ్రనేతలు వరుసగా సమావేశం అవుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఈ భేటీలు జరగ్గా.. తాజాగా మూడోసారి ముంబైలో ఇండియా కూటమి సమావేశం అయ్యింది. ఈ భేటీలో నాయకులంతా కీలక నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి పోరు చేయాల్సిన సన్నద్ధతపై సమాలోచనలు జరిపారు. కలిసి పోటీ చేయాలని ఇండియా కూటమిలోని పార్టీలు తీర్మానం చేశాయి. ఉమ్మడిగా పోటీ చేయడంపై 14 మందితో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. అత్యున్నత నిర్ణయాలు తీసుకునే కమిటీగా ఇది వ్యవహించనుంది.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు కలిసే పోటీ చేయాలని ఇండియా కూటమిలోని పార్టీలు తీర్మానం చేశాయి. వివిధ రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు ప్రక్రియను తక్షణమే ప్రారంభించనున్నట్లు ఓ ప్రకటను విడుదల చేశారు. సహకార స్ఫూర్తితో త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు ఇండియా కూటమిలోని పార్టీ అధినాయకులు. ఈ క్రమంలో దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తేందుకు.. ఆయా ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వివిధ భాషల్లో "జుడేగా భారత్, జీతేగా ఇండియా" అనే థీమ్‌తో ప్రచార వ్యూహాలను సమన్వయం చేసుకొని పనిచేయనున్నట్టు పేర్కొన్నారు. ఇక సెప్టెంబర్ 30 నాటికి సీట్ల సర్దుబాటు కూడా పూర్తి చేసేలా పనిచేయనున్నట్లు సమాచారం అందుతోంది.
కీలకంగా వ్యవహరించనున్న సమన్వయ కమిటీలో సభ్యులను చూసినట్లయితే.. కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్ ఉన్నారు. ఇక ఎన్సీపీ నేత శరద్ పవార్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఆర్జేడీ నుంచి తేజస్వీ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ నుంచి అభిషేక్ బెనర్జీ, శివసేన నుంచి సంజయ్ రౌత్, జార్ఖండ్ నుంచి హేమంత్ సోరెన్, ఆప్ నేత రాఘవ్ చద్దా, సమాజ్ వాదీ పార్టీ నుంచి జావేద్ అలీ ఖాన్, జేడీయూ నుంచి లలన్ సింగ్, సీపీఐ నేత డి.రాజా, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఒమర్‌అబ్దుల్లా, పీడీపీ నుంచి మెహబూబా ముఫ్తీ ఉన్నట్టు తెలుస్తోంది.