లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 18 March 2024 4:44 PM ISTలోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల కోడ్ ప్రస్తుతం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. పలువురు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. పలు రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు.. పశ్చిమ బెంగాల్ డీజీపీని కూడా పక్కన పెడుతూ సంచలన ఉత్తర్వులను జారీ చేసింది.
లోక్‌సభ ఎన్నిలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడంతో సంచలనంగా మారింది. ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల సమయంలో కూడా పలువురు అధికారులను మార్చిన ఈసీ.. లోక్‌సభ ఎన్నికల వేళ ఇలాంటి నిర్ణయాలనే తీసుకుంటోంది. సార్వత్రిక ఎన్నికలను సక్రమంగా నిర్వహించే చర్యల్లో భాగంగానే పలువురు అధికారులను మారుస్తోంది. ఆయా రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను తొలగించింది. గుజరాత్, యూపీ, బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ హోంశాఖ కార్యదర్శులను ఎన్నికల సంఘం తొలగించింది. ఉత్తర్వులను కూడా ఇచ్చింది.
అలాగే మిజోరం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాల్లోని సీనియర్ అధికారులపై కూడా వేటు వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్‌ను కూడా విధుల నుంచి తొలగించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయాలను తీసుకుంది. బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులపై కూడా ఈసీ వేటు వేసింది. బీఎంసీ కమిషనర్, అదపు, డిప్యూటీ కమిషనర్లను ఈసీ తొలగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.