వెస్ట్ బెంగాల్ లో ప్రారంభమైన సంపూర్ణ లాక్‌డౌన్
Lockdown started in west bengal.పశ్చిమబెంగాల్‌లో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధించింది. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి
By తోట వంశీ కుమార్ Published on 16 May 2021 7:27 AM GMTపశ్చిమబెంగాల్‌లో కరోనా విజృంభిస్తోంది. గత కొద్ది రోజులు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధించింది. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఈ ఆంక్షలు ఈ నెల 30వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది.
జనసంచారాన్ని, సమూహాలను కట్టడి చేయడం ద్వారానే కరోనా వ్యాప్తిని అడ్డుకోగలం. ఇలా చేయాలంటే అదనపు ఆంక్షలు అవసరం అని పశ్బిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్ తెలిపారు. సంపూర్ణ లాక్‌డౌన్ సందర్భంగా.. పరిశ్రమలు, మెట్రో సర్వీసులు, అంతర్రాష్ట్ర రైళ్లు, బస్సులను పూర్తిగా నిలిపివేశారు. అన్నిరకాల సమావేశాలపై నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. అత్యవసర సేవలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు నిచ్చారు. ప్రజలు నిత్యావసరాల కొనుగోలుకు అవసరమైన వస్తువులు తెచ్చుకునేందుకు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు దుకాణాలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది.
అంతేకాకుండా.. రాష్ట్రంలోని తేయాకు తోటల్లో 50 శాతం కార్మికులు పనిచేసేలా వెసులుబాటు కల్పించింది. జనపనార మిల్లుల్లో 30 శాతం కార్మికులు పనిచేసేందుకు అనుమతించింది. పశ్చిమబెంగాల్‌లో నిన్న 20,846 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 10,94,802కు చేరాయి. ఇందులో 1,31,792 కేసులు యాక్టివ్‌గా ఉండగా.. 9,50,017 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 12,993 మంది మరణించారు.