ఇక్కడ సెకండ్ వేవ్.. అక్కడ ఏకంగా థర్డ్ వేవ్
Lockdown across all of France.కరోనా థర్డ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించారు.
By తోట వంశీ కుమార్ Published on 1 April 2021 2:15 PM ISTకరోనా మహమ్మారికి ప్రపంచ దేశాలు వణుకుతూ ఉన్నాయి. భారత్ లో కూడా భారీగా కరోనా కేసులు పెరుగుతూ ఉండగా.. ఇంకొన్ని దేశాల్లో కూడా కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తూ ఉంది. ఇప్పటికే చాలా దేశాల్లో సెకండ్ వేవ్ పూర్తీ అయింది. భారత్ లో కాస్త ఆలస్యంగా సెకండ్ వేవ్ మొదలైంది. బుధవారం నాడు దేశవ్యాప్తంగా 72,330 కొత్త కేసులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఈ ఉదయం ప్రకటించింది. ఇదే సమయంలో 459 మంది కరోనా కారణంగా గడచిన 24 గంటల్లో మరణించారని, మరో 40,382 మంది చికిత్స తరువాత డిశ్చార్చ్ అయ్యారని వెల్లడించింది.
బ్రిటన్ లో కరోనా కేసులు నమోదైనట్టే భారత్ లో కూడా కేసులు నమోదవుతున్నాయని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా అన్నారు. బ్రిటన్ లో క్రిస్మస్ పండుగ సందర్భంగానే వైరస్ జన్యుమార్పులకు గురై కొత్త రకం కరోనా పుట్టిందని, మనదేశంలోనూ అదే జరుగుతోందని అన్నారు. హోలీ పండుగప్పుడే కేసులు పెరగడం మరీ ఎక్కువైందన్నారు. బ్రిటన్ లో అప్పుడు ఏదైతే జరిగిందో ఇప్పుడు భారత్ లోనూ అదే జరుగుతోందని.. కేసులు వేగంగా పెరిగిపోవడం వెనుక కొత్త రకం కరోనా ఉండి ఉంటుందన్నారు. కాబట్టి వీలైనంత వేగంగా ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ను అందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఫ్రాన్స్ దేశంలో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. అందుకే ఫ్రాన్స్ మరో కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను విధించింది. కరోనా థర్డ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించారు. పాఠశాలలను మరో మూడు వారాల పాటు మూసేస్తున్నట్టు చెప్పారు. కరోనాను అడ్డుకోవాలంటే ఇదే మంచి నిర్ణయమన్నారు. ఏప్రిల్ మూడో వారం నుంచి 60 ఏళ్లు దాటిన వారందరికీ కరోనా టీకాలు వేస్తామని చెప్పారు. ఆ తర్వాత నెల నుంచి 50 ఏళ్లు దాటిన వారికీ ఇస్తామన్నారు. జూన్ మధ్య నాటికి 3 కోట్ల మందికి కరోనా టీకాలు వేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నామన్నారు. లాక్ డౌన్, వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా కరోనా కట్టడి అవుతుందని, మే మూడో వారం నాటికి పరిస్థితి అదుపులోకి వస్తే మళ్లీ లాక్ డౌన్ ఎత్తేస్తామని చెప్పారు.