ఎల్‌కే అద్వానీకి భారతరత్న ప్రకటించిన కేంద్రం

బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి అరుదైన గౌరవం దక్కింది.

By Srikanth Gundamalla  Published on  3 Feb 2024 12:52 PM IST
LK advani, bharat ratna award, prime minister modi ,

 ఎల్‌కే అద్వానీకి భారతరత్న ప్రకటించిన కేంద్రం 

బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఆయనతో కలిసి ఉన్న ఫొటోలను కూడా షేర్ చేశారు. ఎల్‌కే అద్వానీకి భారతరత్న పురస్కారం లభించడం ఎంతో సంతోషంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో ఎల్‌కే అద్వానీ పాత్ర కీలకమని మోదీ కొనియాడారు.

ఎక్స్‌లో పోస్టు పెట్టిన ప్రధాని మోదీ.. ఎల్‌కే అద్వానీకి భారతరత్న పురస్కారం ఇవ్వబడుతోందనే విషయాన్ని పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆయనతో తాను మాట్లాడానని మోదీ చెప్పారు. ఈ పురస్కారాన్ని ఎల్‌కే అద్వానీ పొందబోతున్నందుకు అభినందనలు తెలిపారు. సమకాలీన అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో అద్వానీ ఒకరు అంటూ మోదీ కొనియాడారు. భారతదేశ అభివృద్దిలో ఆయన చేసిన సేవ, కృషి చిరస్మరణీయమైనవి అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి దేశానికి ఉప ప్రధాన మంత్రిగా చేయడం వరకు ఆయన జీవితం ఎంతో ఉన్నతమైనదని పేర్కొన్నారు. హోంమంత్రిగా, సమాచారశాఖ మంత్రిగా కూడా ఎల్‌కే అద్వానీ సేవలందించారని తెలిపారు. ఎల్‌కే అద్వానీ పార్లమెంటరీ అనుభవం ఎంతో ఆదర్శప్రాయమైనది అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఎల్‌కే అద్వానీకి భారతరత్న పురస్కారం దక్కడంపై రాజకీయాలకు అతీతంగా అందరూ హర్షం వ్యక్తం చేస్తోన్నారు.

కాగా.. ఎల్‌కే అద్వానీ 1927లో కరాచీలో జన్మించారు. విభజన సమయంలో భారతదేశానికి వలస వచ్చి బొంబాయిలో స్థిరపడ్డారు. అక్కడే కళాశాల విద్యను పూర్తి చేశారు. 1941లో ఆర్ఎస్‌ఎస్‌లో చేరి రాజస్థాన్ ప్రచార్‌గా పనిచేశారు. 1951లో భారతీయ జనసంఘ్‌లో సభ్యుడిగా చేరారు. 1966లో జరిగిన ఢిల్లీ మెట్రోపాలిటన్‌ కౌన్సిల్‌ మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాతి ఏడాది అంటే 1967లో ఢిల్లీ మెట్రోపాలిటన్‌ కౌన్సిల్‌ అధ్యక్షడిగా ఎన్నికయ్యారు. 1970 వరకూ ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు. తొలిసారి అద్వానీ 1970లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1989లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఉభయ సభల్లో కూడా అద్వానీ ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 1998 – 2004 మధ్య హోం వ్యవహారాల మంత్రిగా, 2002 – 2004 వరకు ఉప ప్రధాన మంత్రిగా పనిచేశారు. 2015లో ఎల్‌కే అద్వానీ పద్మ విభూషణ్‌ అవార్డును కూడా అందుకున్నారు. తాజాగా భారతరత్న అవార్డు దక్కడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story