మందుబాబులకు భారీ షాక్.. పెరగనున్న మద్యం ధరలు
Liquor to cost more in UP from April 1 as state govt clears new excise policy.మందుబాబులకు షాకిచ్చే వార్త ఇది.
By తోట వంశీ కుమార్
మందుబాబులకు షాకిచ్చే వార్త ఇది. ఏప్రిల్ 1 నుంచి మద్యం ధరలు పెరగనున్నాయి. అయితే.. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో శనివారం మంత్రి మండలి సమావేశమైంది. ఈ సమావేశంలో 2023-24 సంబంధించి నూతనంగా రూపొందించిన ఎక్సైజ్ పాలసీకి ఆమోదం లభించింది. మద్యం అమ్మకాల ద్వారా రూ. 45,000 కోట్ల ఆదాయాన్ని సేకరించే లక్ష్యంతో ఈ పాలసీని రూపొందించారు.
కొత్త విధానంలో విదేశీ మద్యం, బీరు, 'భాంగ్', మోడల్ షాపుల లైసెన్స్ ఫీజును 10 శాతం పెంచింది. మాస్టర్ గోదాముల రిజిస్ట్రేషన్, రెన్యూవల్ ఫీజులను కూడా పెంచారు. గౌతమ్ బుద్ నగర్, ఘజియాబాద్ మరియు లక్నో మునిసిపల్ కార్పొరేషన్‌కు 5 కిలోమీటర్ల పరిధిలో మద్యం విక్రయించే హోటళ్లు/రెస్టారెంట్‌లు మరియు క్లబ్ బార్‌ల లైసెన్స్ ఫీజును కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. దీంతో ఏప్రిల్ 1 నుంచి మద్యం ధరలు పెరగనున్నాయి.
ప్రస్తుతం ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉన్న విక్రయ సమయాన్ని రాత్రి 11 గంటల వరకు పెంచాలని మద్యం లాబీ ఒత్తిడి చేస్తోంది. కొత్త పాలసీ ప్రకారం సమయాలు అలాగే ఉన్నప్పటికీ, ముందస్తు అనుమతి తర్వాత "ప్రత్యేక సందర్భాలలో" విక్రయ సమయాన్ని పొడిగించడానికి అనుమతించనున్నారు.. అయితే.. మద్యం విక్రయ సమయాలను పొడిగించగల “ప్రత్యేక సందర్భాలు” ఏమిటన్నది ఇంకా చెప్పలేదు
కాగా.. కొత్త ఎక్సైజ్ పాలసీ ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు వెచ్చిస్తామని తెలిపింది ప్రభుత్వం.