డిజిటల్ చెల్లింపుల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ మహమ్మారి పరిస్దితుల్లో మరింత సురక్షితమైన డిజిటల్ లావాదేవీలను అందించడంలో భాగంగా కాంటాక్ట్‌లెస్ కార్డులు, ఈ-మాండేట్‌ల పరిమితిని పెంచింది. ప్రస్తుతం రూ.2 వేల వరకు చెల్లింపులు, లావాదేవీలను పిన్ నంబర్ అవసరం లేకుండా జరుపుకొనే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.5 వేల వరకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. 2020 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు.
ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కారణంగా చాలా మంది డిజిటల్ చెల్లింపులకే మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి సమయంలో కాంటాక్ట్‌లెస్ కార్డు లావాదేవీలు, ఈ-మాండేట్‌లు కస్టమర్లకు మరింత సౌకర్యంగా మారుతున్నాయని ఆర్బీఐ పేర్కొంది.
అలాగే డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంలో భాగంగా ఇప్పటికే నెఫ్ట్,ఆర్‌టీజీఎస్ లావాదేవీలపై ఛార్జీలను ఎత్తివేసినట్లు ఆర్బీఐ గుర్తు చేసింది. ఆర్‌టీజీఎస్ సేవలను కూడా ప్రతి రోజు 24x7 పాటు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది.