ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఎంతలా అంటే సహజీవనం చేసేంతగా. వీరిద్దరి ప్రేమను తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో.. ఆ ఇద్దరూ కోర్టుకెక్కారు. మా భవిషత్తు గురించి ఇతరులకు ఎందుకని ప్రశ్నిస్తూనే.. రక్షణ కల్పించాలని కోర్టును కోరారు. వారిద్దరు యువతులు కావడంతో.. ఈ వ్యవహారాన్ని సున్నితంగా పరిగణించిన కోర్టు..ఇది వరకు కోర్టులు ఇచ్చిన తీర్పుల సమగ్ర పరిశీలన మేరకు అడుగులు వేయడానికి నిర్ణయించడం గమనార్హం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. 22ఏళ్ల యువతి ఎంబిఏ చదువుతుండగా.. 20 ఏళ్ల మరో యువతి బీఏ చదువుతోంది. వీరిద్దరు మధురైకి చెందిన వారు. వీరిద్దరికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఎంతలా అంటే.. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా. దీంతో ఆ ఇద్దరూ ఓ నిర్ణయం తీసుకున్నారు. సహజీవనం చేస్తున్నారు. ఈ విషయం ఆ యువతుల తల్లిదండ్రుల దృష్టికి చేరింది. దీంతో వారిని విడదీయడానికి ప్రయత్నించారు. ఇలా చేయడం తప్పని ఇందుకు సమాజం అంగీకరించదని.. నచ్చజెప్పారు. అయినప్పటికీ వారు వినిపించుకోలేదు. ఆ యువతులు ఇద్దరూ తప్పించుకుని తమకు సహాయం చేయాలని చెన్నైలోని ఓ స్వచ్చంద సంస్థను ఆశ్రయించారు.
వీరి ద్వారా మద్రాసు హైకోర్టుకెక్కారు. తామిద్దరం కలిసి జీవించేందుకు నిర్ణయించామని, తమ భవిష్యత్తు గురించి ఇతరులకు ఎందుకో అని ప్రశ్నిస్తూ, తమకు భద్రత కల్పించాలని కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ బుధవారం హైకోర్టు బెంచ్ ముందు విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫు వాదనల్ని విన్న న్యాయస్థానం.. ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని.. ఇదివరకు కోర్టులు ఇచ్చిన తీర్పులను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. ఆ ఇద్దరు యువతుల వాంగ్మూలం, వారి తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని వేర్వేరుగా కోర్టు ముందు ఉంచాలని ఆదేశించారు. అలాగే.. ఈ వ్యవహారంపై దృష్టి పెట్టాలని, సమగ్ర విచారణతో ఏప్రిల్ 26వ తేదీ కోర్టుకు నివేదికను సమర్పించాలని సామాజిక కార్యకర్త విద్య దినకరన్‌నును ఆదేశించింది.