బంగ్లాదేశ్ కేంద్రంగా భారత్‌పై ఉగ్రకుట్ర.. లష్కరే తోయిబా టెర్రరిస్ట్ అరెస్ట్
భారత్‌లో ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నుతున్న లష్కరే తోయిబా (LeT) కీలక సభ్యుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
By - అంజి |
బంగ్లాదేశ్ కేంద్రంగా భారత్‌పై ఉగ్రకుట్ర.. లష్కరే తోయిబా టెర్రరిస్ట్ అరెస్ట్
భారత్‌లో ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నుతున్న లష్కరే తోయిబా (LeT) కీలక సభ్యుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లా కంగన్‌కు చెందిన షబ్బీర్ అహ్మద్ లోన్ (అలియాస్ రాజా, కాశ్మీరీ) అనే ఈ నిందితుడిని సోమవారం ఢిల్లీ సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. సెంట్రల్ ఏజెన్సీల సమన్వయంతో ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ ఈ ఆపరేషన్ నిర్వహించింది.
షబ్బీర్ అహ్మద్ గత కొంతకాలంగా బంగ్లాదేశ్‌లో ఉంటూ పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ (ISI) ఆదేశాల మేరకు భారత్ వ్యతిరేక కార్యకలాపాలను నడిపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను రిక్రూట్ చేసుకుని, పాకిస్థాన్ ప్రమేయం బయటపడకుండా ఉగ్రవాద ప్లాన్లను అమలు చేయడం ఇతని ప్రధాన బాధ్యత. ముజఫరాబాద్‌లోని ఉగ్రవాద శిబిరాల్లో ఇతను అధునాతన శిక్షణ (దౌరా-ఎ-ఖాస్) పొందినట్లు విచారణలో తేలింది.
నిజానికి షబ్బీర్ అహ్మద్‌కు లష్కరే అగ్రనేతలతో దశాబ్దాల కాలంగా సంబంధాలు ఉన్నాయి. 2007లో భారీగా ఆయుధాలు, ఏకే-47 రైఫిల్స్, గ్రెనేడ్లతో ఇతనిని స్పెషల్ సెల్ మొదటిసారి అరెస్ట్ చేసింది. ఆ సమయంలో 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్, లష్కరే కమాండర్ జకీర్ రెహ్మాన్ లఖ్వీలతో ఇతనికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. 2018 వరకు తీహార్ జైలులో ఉన్న షబ్బీర్, బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత బంగ్లాదేశ్‌కు పారిపోయి మళ్ళీ నెట్‌వర్క్‌ను పునర్నిర్మించాడు.
ఇటీవలే ఢిల్లీ, దక్షిణ భారతదేశంలో బయటపడిన లష్కరే మాడ్యూల్ వెనుక కూడా ఇతని హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్న ఏజెన్సీలు.. భారత్‌లో వారి రిక్రూట్‌మెంట్ మార్గాలు, నిధుల సరఫరా మరియు తదుపరి లక్ష్యాల గురించి ఆరా తీస్తున్నాయి.