డబ్బులు ఆశ చూపి.. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి.. ఆ తర్వాత నేరుగా..

Lashkar Terrorist Ali Babar exposes Pakistan Army.మన పక్క దేశం పాకిస్తాన్‌ వక్రబుద్ధి మరోసారి బట్టబయలైంది. యువతనే

By అంజి  Published on  30 Sep 2021 3:43 AM GMT
డబ్బులు ఆశ చూపి.. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి.. ఆ తర్వాత నేరుగా..

మన పక్క దేశం పాకిస్తాన్‌ వక్రబుద్ధి మరోసారి బట్టబయలైంది. యువతనే లక్ష్యంగా చేసుకుని.. వారికి ఉగ్రవాద శిక్షణ ఇచ్చి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేలా చేస్తోందనడానికి మరోసారి ఆధారాలు లభించాయి. సెప్టెంబర్‌ 25న భారత్‌లోకి చొరబడేందుకు ఇద్దరు ఉగ్రవాదులు ప్రయత్నించగా ఒకరిని మట్టుబెట్టిన ఆర్మీ.. మరొకరిని సజీవంగా పట్టుకుంది. జమ్ముకశ్మీర్‌లోని యూరి సెక్టార్‌లో ఇటీవల ఆర్మీకి పట్టుబడ్డ ఉగ్రవాది అలీ బాబర్‌ సంచలన విషయాలు చెప్పాడు. తనకు లష్కరే తోయిబాతో పాక్ సైన్యం ఉగ్రవాద శిక్షణ ఇచ్చిందని తెలిపాడు. బారాముల్లా జిల్లాలోని పట్టాన్‌కు ఆయుధ సామాగ్రిని తరలించడానికి తనకు శిక్షణ ఇచ్చిన సంస్థలు రూ.20 వేలు ఇచ్చాయని చెప్పాడు. ఆయుధాలను తరలించిన తర్వాత రూ.30 వేలు ఇస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నాడు. పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లోని లష్కరే క్యాంపులో శిక్షణ పొందానని, తనతో శిక్షణ పొందిన ఆరుగురు ఉగ్రవాదుల బృందం సెప్టెంబర్‌ 18న భారత్‌లోకి చొరబడ్డారని 19 ఏళ్ల అలీ బాబర్ తెలిపాడు.

ఇస్లాం ప్రమాదంలో ఉందని చెప్పి తనను తప్పుదోవ పట్టించారని అన్నాడు. నా తండ్రి మరణం తర్వాత లష్కరే తోయిబాకు చెందిన ఒకరిని కలిశానన్నాడు. ఉగ్రవాది అలీ బాబర్‌ పాకిస్తాన్‌ పంజాబ్‌ ప్రావిన్స్‌లోని ఓకారకు చెందిన దీపాలపూర్‌ వాసేవావాలా గ్రామానికి చెందిన వ్యక్తిగా ఆర్మీ గుర్తించింది. కాగా తనను అదుపులోకి తీసుకున్న భారత ఆర్మీ.. ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా చూసుకుందని చెప్పాడు. అలాగే పాకిస్తాన్‌ సైన్యం లేకుండా ఏ ఉగ్రవాది కూడా భారత్‌లోకి చొరబడడని అన్నాడు. ఐఎస్‌ఐ ద్వారా తమకు తుపాకీ కాల్చడంలో శిక్షణ ఇచ్చారని.. మిషన్‌ కోసం వెళ్తున్నారని చెప్పారని అన్నాడు. భారత్‌లోకి చొరబడేముందు పాకిస్తాన్‌ ఆర్మీ అనేక సూచనలు చేస్తుందని అన్నాడు. ఇటీవల కాలంలో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాది భారత్‌లోకి చొరబడుతుండగా ఆర్మీ సజీవంగా పట్టుకొవడం ఇదే తొలిసారి. 2016లోని యూరి ఘటనలో 19 సైనికులు మరణించారు. గత కొన్ని నెలలుగా భారత్‌లోకి ఉగ్రవాదుల చొరబాటు పెరిగిందని ఆర్మీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం కశ్మీర్‌ లోయలో 70 మంది ఉగ్రవాదులు ఉండొచ్చని ఆర్మీ అధికారుల అంచనా.

Next Story