హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ రోడ్డుపై వెలుతున్న వాహనాలపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన కిన్నౌర్ జిల్లాలో చోటు చేసుకుంది. కొండచరియలు వాహనాలపై విరిగి పడడంతో పలు వాహనాల్లో 40 మంది వరకు చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
రిక్‌కాంగ్ పియో-షిమ్లా జాతీయ రహదారిపై కిన్నౌర్ వద్ద బుధవారం మధ్యాహ్నాం 12.45 నిమిషాల ప్రాంతంలో కొండచరియలు విరిగి పడినట్లు ఐటీబీపీ(ఇండో-టిబెటన్ బార్డర్) పోలీసులు తెలిపారు. కిన్నౌర్ నుంచి సిమ్లాకు వెలుతున్న హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ రవాణాకు చెందిన ప్రయాణీకుల బస్సు, ఓ ట్రక్కు, కొన్ని కార్డు కొండ చరియల కింద చిక్కుకున్నట్లు చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా.. కొండపై నుంచి రాళ్లు ఇంకా పడుతుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఈ ప్రమాదంలో ఎంత మంది గాయపడ్డారు, ప్రాణ నష్టం జరిగిందా అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.