భూ కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న రైల్వే మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి, వారి కుమార్తె మిసా భారతి తదితరులకు ఢిల్లీ రోస్ అవెన్యూ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 29న జరగనుంది. ఢిల్లీలోని రూజ్ అవెన్యూ కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా, లాలూ వీల్ చైర్ లో బుధవారం వచ్చారు. ఆయన వెంట భార్య, కుమార్తె ఉన్నారు. రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ పనిచేసిన సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి.. వారి నుంచి తక్కువకు భూములు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీబీఐ ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేయకుండానే కోర్టులో చార్జ్ షీటు దాఖలు చేసింది. కేసులో ప్రతి ఒక్కరూ రూ.50వేల చొప్పున వ్యక్తిగత బెయిల్ బాండ్ కింద జమ చేయాలని, ష్యూరిటీ కింద ఇంతే మొత్తాన్ని డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది.
లాలూ ప్రసాద్ యాదవ్ మూత్ర పిండాలు చెడిపోవడంతో, ఆయన కుమార్తె ఒక కిడ్నీ దానం చేసింది. సింగపూర్ లో కిడ్నీ మార్పిడిని విజయవంతంగా పూర్తి చేసుకుని లాలూ తిరిగొచ్చారు. ప్రస్తుతం దాన్నుంచి కోలుకుంటున్నారు. ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసు విచారణలో భాగంగా ఢిల్లీలోని బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం మార్చి 10న 11 గంటలకు పైగా సోదాలు నిర్వహించింది. ఢిల్లీ ఎన్‌సీఆర్, పాట్నా, ముంబై, రాంచీలోని వివిధ ప్రాంతాల్లో 24 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. నిర్దిష్ట ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా ఈ సోదాలు జరిగాయి.