క‌రెన్సీ నోట్ల‌పై ల‌క్ష్మీదేవి, వినాయ‌కుడి ఫోటోలు ముద్రించాలి : కేజ్రీవాల్‌

Lakshmi and Ganesha photo on currency notes will help India to prosper says Kejriwal.క‌రెన్సీపై ల‌క్ష్మీదేవి, వినాయ‌కుడి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Oct 2022 7:52 AM GMT
క‌రెన్సీ నోట్ల‌పై ల‌క్ష్మీదేవి, వినాయ‌కుడి ఫోటోలు ముద్రించాలి : కేజ్రీవాల్‌

దేశ క‌రెన్సీ నోట్ల‌పై ల‌క్ష్మీదేవి, వినాయ‌కుడి ఫోటోలు ముద్రించాల‌ని ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అన్ని నోట్ల‌ను మార్చాల‌ని తాను చెప్ప‌డం లేద‌ని.. కొత్త‌గా ముద్రించ‌నున్న నోట్ల‌పై ఓ వైపు గాంధీజీ, మ‌రోవైపు ల‌క్ష్మీదేవి, వినాయ‌కుడి చిత్రాల‌ను ముద్రించాల‌ని ప్ర‌ధాని మోదీతో పాటు కేంద్రాన్ని కోరారు. క‌రెన్సీ నోట్ల‌పై దేవ‌త‌ల చిత్రాలు ఉండ‌డం వ‌ల్ల దేశం అభివృద్ధి చెందుతుంద‌ని అన్నారు.

"ల‌క్ష్మీదేవి ఫోటో క‌రెన్సీ నోటుపై ఉంటే దేశ ప్ర‌జ‌ల‌కు ఆమె ఆశీర్వాలు ల‌భిస్తాయి. ఇది ఆర్థిక వ్య‌వ‌స్థ వృద్ధి చెంద‌డానికి దోహ‌ద‌ప‌డుతుంది. క‌ష్టాల‌ను దూరం చేసే దేవుడిగా పేరున్న వినాయ‌కుడి ఫోటోతో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తీరుతాయి." అని కేజ్రీవాల్ అన్నారు.

వ‌ర్చువ‌ల్‌గా మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ప‌త‌నం అవుతున్న రూపాయి గురించి తొలుత మాట్లాడారు. ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లంగా ఉండాలంటే.. మంచి పాఠశాలలు, ఆస్ప‌త్రులు, మౌలిక వ‌స‌తులు ఉండాల‌న్నారు. ఒక్కొసారి ప్ర‌భుత్వం ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా స‌త్ఫ‌లితాలు రావ‌న్నారు. వ్యాపారులు అంతా త‌మ ప‌ని మొద‌లు పెట్టేముందు ల‌క్ష్మీదేవికి, వినాయ‌కుడికి పూజ‌లు చేస్తార‌న్నారు.

ఇండోనేషియా ముస్లిం దేశమని, అక్కడి జనాభాలో 85% ముస్లింలు, 2% హిందువులు ఉంటార‌న్నారు. అలాంటి దేశం త‌మ క‌రెన్సీ పై గ‌ణేష్ బొమ్మ‌లు ముద్రిస్తుంటే మ‌న దేశంలో ఎందుకు ముద్రించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. దీనిపై మ‌రో రెండు రోజుల్లో ప్ర‌ధానికి లేఖ రాస్తాన‌ని చెప్పారు.

Next Story