లఖీమ్‌పూర్ ఘటనపై సుప్రీం కోర్టు విచారణ రేపటికి వాయిదా
Lakhimpur violence SC asks UP govt to file status report on arrests.లఖీమ్‌పూర్ హింసాత్మక ఘటనపై సుప్రీం కోర్టు విచారణ
By M.S.R
లఖీమ్‌పూర్ హింసాత్మక ఘటనపై సుప్రీం కోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. కేసు విచారణ సందర్భంగా కమిషన్ వేశామని యూపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపడంతో శుక్రవారంలోగా ఈ ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ కేసులో ఎంత మందిని అరెస్ట్ చేశారు? సవివరమైన నివేదికను శుక్రవారం సమర్పించాలని యూపీ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ రిపోర్ట్‌లో చనిపోయిన వారి వివరాలతోపాటు ఎఫ్ఐఆర్ సమాచారం, ఎవరిని అరెస్ట్ చేశారు, విచారణ కమిటీ వంటి మొత్తం సమాచారం ఉండాలని స్పష్టం చేసింది. రైతు లవ్‌ప్రీత్ సింగ్ తల్లి చికిత్స కోసం యూపీ ప్రభుత్వం అవసరమైన సాయం చేయాలని ఆదేశించింది. యూపీలోని లఖీంపూర్ ఖేరీలో రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా వాహనం దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మరణించిన విషయం తెలిసిందే.
లఖీమ్‌పూర్ హింసాత్మక ఘటన కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ నేతృత్వంలోని గల ధర్వాసనం గురువారం విచారించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లఖీమ్‌పూర్ ఘటనను విచారించడానికి రిటైర్డ్ జడ్జీ ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవతో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఈ కమిషన్ తన విచారణను రెండు నెలల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది.