బెంగాల్ కూలీకి రూ.75లక్షల జాక్‌పాట్.. పోలీస్ స్టేషన్‌కు పరుగు
బెంగాల్ రాష్ట్రానికి చెందిన కూలీకి లాటరీలో ఏకంగా రూ.75లక్షలు వచ్చాయి.
By తోట వంశీ కుమార్ Published on 18 March 2023 9:58 AM ISTలాటరీ టికెట్ చూపుతున్న బాదేశ్
ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని స్వగ్రామాన్ని విడిచి వేరే రాష్ట్రానికి వెళ్లాడు. ఆ రాష్ట్రంలోని ప్రజలు మాట్లాడే బాష అతడికి సరిగ్గా రానేరాదు. తనకున్న అలవాటు ప్రకారం లాటరీని కొన్నాడు. ఇన్నాళ్లుగా వరించిన అదృష్టం అతడి తలుపు తట్టింది. లాటరీలో ఏకంగా రూ.75లక్షల నగదు అతడి సొంతమైంది. అయితే.. తనకు లాటరీ తగిలిన ఆనందం ఓ వైపు ఉండగా తన లాటరీ టికెట్‌ను ఎవరైనా కొట్టేస్తారు అన్న భయం అతడిలో మొదలైంది. ఏం చేయాలో అతడికి పాలుపోలేదు. వెంటనే అతడు స్థానిక పోలీస్ స్టేషన్‌కు పరుగు తీశాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన బాదేశ్ కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులంలోని చొట్టానికరలో రోడ్డు నిర్మాణపనుల్లో కార్మికుడిగా పని చేస్తున్నాడు. బాదేశ్‌కు లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్త్రీ శక్తి లాటరీ వద్ద టికెట్ కొన్నాడు. ఆ టికెట్‌కు మంగళవారం రూ.7లక్షల లాటరీ తగిలింది. దీంతో రాత్రికి రాత్రే అతడు లక్షాధికారిగా మారిపోయాడు. ఓ వైపు ఆనందంగానే మరో వైపు అతడి వెన్నులో వణుకు మొదలైంది. తనను ఏమైనా చేసి లాటరీ టికెట్ లాక్కుంటారని భయపడ్డాడు. వెంటనే మువట్టుపుళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.
తనకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నాడు. కాగా.. బాదేశ్‌కు లాటరీ టికెట్ క్లెయిమ్ చేసుకోవడమెలానో తెలియదని, దీనికి తోడు టికెట్ ఎవరైనా లాక్కుని హాని తలపెడతారన్న భయంతోనే బాదేశ్ తమను ఆశ్రయించినట్టు పోలీసులు తెలిపారు. అతడికి సాయం చేయనున్నట్లు తెలిపారు.
లాటరీ ప్రైజ్‌మనీ రాగానే స్వగ్రామానికి వెళ్లి ఇంటికి మరమ్మత్తులు చేయించి, వ్యవసాయం చేసుకుంటానని బాదేశ్ తెలిపాడు.