నటి ఖుష్బూకు బీజేపీ టికెట్.. ఎక్కడి నుండి పోటీ అంటే
Kushboo Sundar To Contest from Thousand Lights.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు సెలెబ్రిటీలు కూడా పోటీ, నటి ఖుష్బూకు బీజేపీ టికెట్
By తోట వంశీ కుమార్ Published on 14 March 2021 3:37 PM GMTతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు సెలెబ్రిటీలు కూడా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన సీనియర్ నటి కుష్బూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. బీజేపీ నేడు విడుదల చేసిన తొలి జాబితాలో ఆమెకు చోటు లభించింది. చెన్నైలోని థౌజండ్ పిల్లర్ లైట్స్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. డీఎంకే నేత డాక్టర్ ఎజిలాన్ పై ఆమె పోటీ చేయబోతున్నారు. తనకు టికెట్ ఇచ్చినందుకు బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయబోమనని హామీ ఇస్తూ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీలో అణచివేత ధోరణి ఎక్కువ అయిపోయిందని సోనియాగాంధీకి గతేడాది ఘాటు లేఖ రాశారు. పార్టీలో నిజాయతీగా పనిచేస్తున్న తనలాంటి వారిని అణచివేస్తున్నారని, పక్కన పెడుతున్నారని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత పార్టీని వీడి బీజేపీలో చేరారు. కాంగ్రెస్‌లో చేరడానికి ముందు కుష్బూ డీఎంకేలో ఉన్నారు. ఎన్నికల్లో కుష్బూ పోటీ చేయడం ఇదే తొలిసారి. ఆమె గెలవడం కష్టమేనని అంటున్నారు.
డీఎంకే ఎమ్మెల్యే తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. డీఎంకే ఎమ్మెల్యే శరవణన్ నేడు కమలం పార్టీలో చేరారు. మధురై ప్రాంతంలోని తిరుపుప్పరన్‌కుండ్రమ్ నియోజవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న శరవణన్ చేరికతో బీజేపీలో చేరిన డీఎంకే ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు పెరిగింది. శరవణన్ మాట్లాడుతూ.. తాను పార్టీని వీడడానికి జిల్లా స్థాయిలోని ముఖ్య నేతలే కారణమని ఆరోపించారు. జిల్లా కార్యదర్శులు తనను నిశ్శబ్దంగా హింసించారని ఆరోపించారు. తానో మెడికల్ డాక్టర్‌నని, తన మనస్తత్వానికి డీఎంకేలో వాతావరణం సరిపడదని, అందుకనే ఆ పార్టీని వీడి బీజేపీలో చేరానని శరవణన్ పేర్కొన్నారు. మదురైలో ఓ ఆసుపత్రి నిర్వహిస్తున్న డీఎంకే ఎమ్మెల్యే తొలుత బీజేపీతోనే ఉండేవారు. ఆ తర్వాత డీఎంకేలో చేరారు. ఇప్పుడు మళ్లీ బీజేపీలోకే వచ్చేశారు.