'నా బిడ్డను ఇంటికి తీసుకురండి'.. మధ్యప్రదేశ్‌ సీఎం సహాయం కోరిన మొనాలిసా తండ్రి

ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో 'కుంభమేళా గర్ల్'గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మొనాలిసా భోంస్లే వివాహం ఇప్పుడు సామాజిక చర్చకు దారితీసింది.

By -  అంజి
Published on : 14 March 2026 1:41 PM IST

Monalisa Bhonsle Marriage Kerala, Kumbh Mela Girl Love Jihad Allegation, Farman Khan and Monalisa Wedding, MP CM Mohan Yadav Intervention Request, Hindu Jagran Manch Monalisa Case

'నా బిడ్డను ఇంటికి తీసుకురండి'.. మధ్యప్రదేశ్‌ సీఎం సహాయం కోరిన మొనాలిసా తండ్రి

ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో 'కుంభమేళా గర్ల్'గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మొనాలిసా భోంస్లే వివాహం ఇప్పుడు సామాజిక చర్చకు దారితీసింది. మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ పట్టణానికి చెందిన 18 ఏళ్ల మొనాలిసా, కేరళలోని పూవార్‌లో ఫర్మాన్ ఖాన్ అనే యువకుడిని వివాహం చేసుకుంది. కేరళలోని నైనార్ దేవాలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం బుధవారం వీరి వివాహం జరిగింది. అయితే, ఈ పెళ్లిపై మొనాలిసా తండ్రి జయసింగ్ భోంస్లే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

మొనాలిసా తండ్రి జయసింగ్ భోంస్లే ఇది "లవ్ జిహాద్" అని ఆరోపిస్తున్నారు. తన కుమార్తెను ఫర్మాన్ ఖాన్ మోసపూరితంగా ట్రాప్ చేశాడని ఆయన వాదిస్తున్నారు. తన కుమార్తె సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోందని, కొందరు వ్యక్తులు ఆమెకు నటన, నృత్యం నేర్పిస్తామని చెప్పి తీసుకెళ్లారని, చివరకు ఇలా జరుగుతుందని తాను ఊహించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొనాలిసాను సురక్షితంగా మధ్యప్రదేశ్‌కు తిరిగి తీసుకురావాలని ఆయన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సహాయాన్ని కోరారు. హిందూ జాగరణ్ మంచ్ వంటి సంస్థలు కూడా ఆమెను తిరిగి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని ప్రకటించాయి.

మరోవైపు, మొనాలిసా భోంస్లే తన తండ్రి ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చింది. తిరువనంతపురంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె, ఈ వివాహం తన స్వయం నిర్ణయమని స్పష్టం చేసింది. తన తండ్రికి తన అత్త కొడుకుతో పెళ్లి చేయడం ఇష్టమని, కానీ తనకు అది ఇష్టం లేక అభ్యంతరం వ్యక్తం చేశానని తెలిపింది. ఫర్మాన్ ఖాన్‌ను తానే ఇష్టపడ్డానని, పెళ్లి కోసం అతడిని తానే బలవంతం చేశానని ఆమె వెల్లడించింది. తమ మధ్య మత మార్పిడి ప్రస్తావనే లేదని, తమ తమ మతాలను గౌరవించుకుంటూ కలిసి ఉంటామని ఆ దంపతులు స్పష్టం చేశారు.

ఈ వివాహం జరగడానికి ముందు మొనాలిసా తనకు రక్షణ కావాలని కోరుతూ కేరళలోని తంబనూర్ పోలీసులను ఆశ్రయించింది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి ఉండటంతో పోలీసుల సహాయంతో నైనార్ దేవాలయంలో వివాహం చేసుకున్నట్లు సమాచారం. కేరళకు చెందిన కొందరు మంత్రుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరగడం విశేషం. ప్రస్తుతం ఈ అంశం మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల మధ్య ఒక చర్చనీయాంశంగా మారింది.

Next Story