మణిపూర్‌లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. కాంగ్ పోక్సి జిల్లాలోని బి గమ్నోమ్ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. కుకి మిలిటెంట్లు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో గ్రామ పెద్దతో పాటు ఓ మైనర్ బాలుడు ఉన్నారన్నారు. ఇప్పటి వరకు మూడు మృతదేహాలను స్వాదీనం చేసున్నామన్ని మిలిటెంట్ల కోసం విస్తృతంగా గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.
కాగా.. గత ఆదివారం భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో నలుగురు కుకీ ఉగ్రవాదులు మరణించారు. వారిలో ఇద్దరు ఉగ్రవాదులకు అంత్యక్రియలను గ్రామస్తులు నిర్వహిస్తుండగా.. ఒక్కసారిగా మిలిటెంట్లు కాల్పులకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు.
మరోవైపు వరుస ఎన్‌కౌంటర్లతో జమ్మూకశ్మీర్ అట్టుడుకుతోంది. దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య నిన్న భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.