బెంగాల్ డాక్టర్‌పై హత్యాచారం కేసు.. గ్యాంగ్ రేప్ జరగలేదు..!
కోల్‌కతాలోని ఆర్‌జీకర్ ఆస్పత్రిలో వైద్యురాలిపై జరిగిన హత్యాచార సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
By Srikanth Gundamalla Published on 6 Sep 2024 7:15 AM GMTకోల్‌కతాలోని ఆర్‌జీకర్ ఆస్పత్రిలో వైద్యురాలిపై జరిగిన హత్యాచార సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. హత్యాచారంపై ఎన్నో విషయాలు ఇప్పటికే ప్రచారం జరగ్గా..తాజాగా సీబీఐ విచారణలో మరో సంచలన విషయం బయటపడినట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే. ఆ వార్తల్లో వాస్తవం లేదని తన విచారణలో సీబీఐ గుర్తించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. నిందితుడు సంజయ్‌రాయ్ ఒక్కడే ఈ దారుణానికి పాల్పడినట్లు సీబీఐ నిర్ధారణకు వచ్చినట్లు చెబుతున్నాయి. ఇక సీబీఐ దర్యాప్తు కూడా తుది దశకు చేరిందనీ.. త్వరలోనే చార్జ్‌షీట్ దాఖలు చేయనుందని తెలుస్తోంది.
ఆర్‌జీకర్ ఆస్పత్రిలో హత్యాచార సంఘటనపై తొలుత బెంగాల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కానీ.. పోలీసుల విచారణపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దాంతో.. కోల్‌కతా కోర్టు ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. ఇక సీబీఐ దర్యాప్తుపై ఇటీవల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శలు చేశారు. రోజులు గడుస్తున్నా న్యాయం జరగడం లేదని అన్నారు. ఎలాంటి పురోగతిని కూడా చూపించడం లేదంటూ వ్యాఖ్యానించారు. ఇక సీఎం మమతా కామెంట్స్ నేపథ్యంలో సీబీఐ నుంచి ఈ సమాచారం బయటకు వచ్చింది.
కాగా.. ఆర్జీ కర్ ఆసుపత్రిలోని సెమినార్ రూమ్‌లో ఆగస్టు 9న వైద్య విద్యార్థి మృతదేహం లభ్యం అయ్యింది. తొలుత ఆత్మహత్య చేసుకుందని అధికారులు చెప్పినప్పటికీ.. హత్యాచారమని దర్యాప్తులో తేలింది. వాలంటీర్‌గా పనిచేస్తున్న సంజయ్‌రాయ్‌ను ఈ కేసులో పోలీసులు ఘటన జరిగిన మరుసటి రోజే అరెస్టు చేశారు. అతడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో అశ్లీల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. ఇక అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలను చెప్పారు. అతడు పశ్చాత్తాపం పడట్లేదనీ.. ఏమైనా చేసుకోండి అంటూ చెప్పాడు. మరోవైపుసంజయ్ ఒక్కడే కాదు హత్యాచారంలో ఇంకొందరు కూడా ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ.. సీబీఐ వర్గాలు మాత్రం ఇదంతా అవాస్తవమంటూ తేల్చినట్లు సంబంధిత వర్గాలు చెప్పడం సంచలనంగా మారింది.