వయనాడ్‌లో పెరుగుతున్న మృతులు, మట్టిదిబ్బల కిందే 240 మంది
కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి ప్రకోపం చూపించింది. ఈ విపత్తులో ఎన్నో కుటుంబాలు ప్రాణాలు కోల్పోయాయి.
By Srikanth Gundamalla Published on 1 Aug 2024 6:30 AM GMTవయనాడ్‌లో పెరుగుతున్న మృతులు, మట్టిదిబ్బల కిందే 240 మంది
కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి ప్రకోపం చూపించింది. ఈ విపత్తులో ఎన్నో కుటుంబాలు ప్రాణాలు కోల్పోయాయి. కొందరు అనాథలుగా మిగిలారు. రెండ్రోజుల క్రితం భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి గ్రామాలను నేలమట్టం చేశాయి. ఈ ఘటనలో ఇప్పటికే 277 మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. మరో 200 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు 240 మంది వరకు ఆచూకీ తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు. అక్కడే మట్టిదిబ్బల కింద వారు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.
వయనాడ్ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి భారీ వర్షాలు పడ్డాయి. దాంతో.. కొండచరియలు విరిగి పడ్డాయి. మండక్కై, చూరాల్‌మల ప్రాంతాలు పూర్తిగా నామరూపాల్లేకుండా వరదలో కొట్టుకుపోయాయి. కొండచరియలు విరిగిపడి మట్టిదిబ్బలు కప్పుకుని పోయాయి. ఈ సంఘటన తర్వాత సహాయక చర్యల్లో ఆర్డీ, ఎన్డీఆర్ఎఫ్ కూడా పాల్గొన్నాయి. ఒకవైపు వర్షాలు పడుతున్న క్రమంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో మూడోరోజు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వేల మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. సురక్షిత శిబిరాలకు తరలించారు. బండరాళ్లు పడి అనేక ఇళ్లు నేలమట్టం కావడంతో వాటి కింద ప్రజలు నలిగిపోయారు. బాధితులను గుర్తించేందుకు ఆర్మీ జాగిలాలతో అన్వేషిస్తున్నారు.
ఇక ఈ సంఘటన తర్వాత రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలు గురువారం ఉదయం వయనాడ్‌కు వెళ్లారు. సహాయక శిబిరాలు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అంనతరం కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతాలను కూడా సందర్శించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఈ ఉదయం వయనాడ్ వెళ్లి విపత్తు పరిస్థితిపై సమీక్షించారు. వయనాడ్ బాధితుల కోసం ప్రముఖులు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. పలువురు వ్యాపారవేత్తలు కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు.