ఆర్మీ రంగ ప్ర‌వేశం.. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ కేర‌ళ ట్రెక్క‌ర్ బాబు

Kerala trekker stuck in niche on hill in Malampuzha rescued by Army. రెండు రోజులుగా కేర‌ళోని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Feb 2022 12:22 PM IST
ఆర్మీ రంగ ప్ర‌వేశం.. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ కేర‌ళ ట్రెక్క‌ర్ బాబు

రెండు రోజులుగా కేర‌ళోని పాల‌క్కాడ్ జిల్లాలోని కురుంబాచి కొండ చీలిక‌లో చిక్కుకున్న యువ‌కుడిని ఎట్ట‌కేల‌కు ఆర్మీ ర‌క్షించింది. ఈ రోజు(బుధ‌వారం) అత‌డిని ర‌క్షించేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. ముందుగా అత‌డికి ఆహారం, నీటిని అందించారు. అనంత‌రం అత‌డిని సుర‌క్షితంగా పైకి తీసుకువ‌చ్చారు.

ఏం జ‌రిగిందంటే..?

కేర‌ళ‌కు చెందిన బాబు (23) అనే యువ‌కుడు మ‌రో ఇద్ద‌రు స్నేహితుల‌తో క‌లిసి మ‌ల‌ప్పుజ స‌మీపంలోని కురుంబాచి కొండ ఎక్కేందుకు య‌త్నించారు. అయితే.. ఇద్ద‌రు స్నేహితులు మ‌ధ్య‌లోనే త‌మ ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకోగా.. బాబు మాత్రం కొండ శిఖ‌రం చేరుకున్నాడు. అయితే.. అనుకోకుండా జారి ప‌డడంతో కొండ మ‌ధ్య‌లో ఉన్న ఓ చీలిక మ‌ధ్య చిక్కుకున్నాడు. అత‌డిని ర‌క్షించేందుకు స్నేహితులు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. స‌మాచారం అందుకున్న వెంట‌నే స‌హాయ‌క బృందాలు అత‌డిని ర‌క్షించేందుకు య‌త్నించాయి.. అయితే అత‌డి వ‌ర‌కూ వెళ్లలేక‌పోయారు. దీంతో దాదాపు 43 గంటలుగా తిండి, నీరు లేకుండా అత‌డు అక్క‌డే ఉండాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. విష‌యం తెలుసుకున్న సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ ఆర్మీ సాయం కోరారు. వెంట‌నే ఆర్మీకి చెందిన స‌ద‌ర‌న్ క‌మాండ్ బుధ‌వారం ఉద‌యం రంగంలోకి దిగి అత‌డిని ర‌క్షించింది.

Next Story