కేరళలో జికా వైరస్ కలకలం
Kerala logs 13 cases of Zika virus.కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టకముందే.. ఇప్పుడు కేరళలో తొలిసారిగా జికా
By తోట వంశీ కుమార్ Published on 9 July 2021 8:47 AM ISTకరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టకముందే.. ఇప్పుడు కేరళలో తొలిసారిగా జికా వైరస్ వెలుగుచూడడం కలకలం రేపుతోంది. వచ్చే నెలలో కరోనా థర్డ్ వేవ్ దేశాన్ని ఇబ్బంది పెట్టనుందనే అంచనాల మధ్యే దోమ కాటు ద్వారా వ్యాపించే జికా వైరస్ కేసులు గుర్తించడం కేరళ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. తిరువనంతపురం జిల్లాలో 13 జికా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు 19 శాంపిళ్లను పంపించగా.. 12 మందికి జికా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తేలింది. అంతముందు 24 ఏళ్ల గర్భిణిలో ఈవైరస్ తొలిసారి వెలుగుచూసింది.
24 ఏళ్ల గర్భిణీ మహిళకు జికా వైరస్ సోకినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురం జిల్లా పరస్సల గ్రామానికి చెందిన గర్భిణీ మహిళ జూన్ 28న తలనొప్పితో పాటు, శరీరంపై రెడ్ మార్క్‌లు ఏర్పడడంతో ఆమె కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె జికా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. ఈనెల 7న ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. బిడ్డలో వైరస్ లక్షణాలు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కేరళ ఆరోగ్య శాఖ, తిరువనంతపురం జిల్లా ఉన్నతాధికారులు జికా వైరస్ కేసులను తీవ్రంగా పరిగణిస్తూ తదుపరి చర్యలకు పూనుకుంటున్నారు. ఈడెస్ జాతుల దోమల నమూనాలను సేకరించి చర్యలు తీసుకున్నారు. ఈడెస్ జాతి దోమ కాటు ద్వారా జికా వైరస్ ప్రజలకు వ్యాపిస్తుంది. తిరువనంతపురం 13 జికా వైరస్ కేసులు నమోదైన నేపథ్యంలో అన్ని జిల్లాలను అప్రమత్తం చేసినట్టు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ మీడియాకు తెలిపారు.
జికా వైరస్‌కు మందు లేదు..
ఈడెస్ దోమలు సాధారణంగా పగటిపూట కరుస్తాయి. ఈ దోమల నుంచి జికా వైరస్ మనుషులకు సోకుతుంది. ప్రాణాంతకం కాకపోయినప్పటికి ఇప్పటి వరకూ దీనికి మందు లేకపోవడం ఆందోళన కలిగించే విషయం.ఈ వైరస్ సోకితే.. కొందరిలో జర్వం, దద్దర్లు, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలకు సోకితే.. వారి ఎదుగుదలపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. మొదట 1947లో ఉగాండ అడవుల్లో కోతుల్లో ఈ వైరస్ కనిపించింది. 1952లో మనుషుల్లోనూ గుర్తించారు.