దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో గత కొద్ది రోజులుగా లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. దీంతో ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు పలు రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. కొన్ని రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూను విధించగా.. మరికొన్ని రాష్ట్రాలు వీకెండ్ లాక్‌డౌన్, సంపూర్ణ లాక్‌డౌన్ వంటి ఆంక్షలను విధించాయి. తాజాగా ఆ రాష్ట్రాల జాబితాలో మరో రాష్ట్రం చేరింది. ఆ రాష్ట్రమే కేరళ.
కేరళ రాష్ట్రంలో కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారి కట్టడి కోసం 8 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. ఈ నెల 8వ తేదీ ఉదయం ఆరు గంట నుంచి 16వ తేదీ అర్థరాత్రి వరకు లాక్‌డౌన్ అమల్లో ఉండనుందని సీఎం తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు తగ్గడం లేదని.. ఈ మహమ్మారి కట్టడికి లాక్‌డౌన్ తప్పట్లేదని స్పష్టం చేశారు. కాగా.. కేరళలో నిన్న ఒక్క రోజే 42 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.