కేరళలో ఘోరం.. కొండచరియలు విరిగిపడి ఏడుగురు దుర్మరణం

భారీగా కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ సంఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు.

By Srikanth Gundamalla
Published on : 30 July 2024 2:15 AM

kerala, landslide, seven dead, several injured,

కేరళలో ఘోరం.. కొండచరియలు విరిగిపడి ఏడుగురు దుర్మరణం

ఇండియాలోనే కేరళను దేవభూమిగా చెబుతుంటారు. అక్కడ ప్రకృతి అందరినీ ఆకర్షిస్తుంది. కానీ.. వర్షాకాలంలో మాత్రం అక్కడ పరిస్థితులు మరోలా ఉంటాయి. ప్రకృతి బీభత్సంతో అక్కడ వరదలు సంభవిస్తున్నాయి. తాజాగా భారీగా కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ సంఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరికొందరికి గాయాలు అయ్యాయి. వయనాడ్ జిల్లాలోని మెప్పాడి దగ్గర హిల్స్‌ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పాయారు. ఇంకా చాలా మంది కొండ చరియల శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు బృందాలు సైతం వయనాడ్‌కు చేరుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కొండచరియల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయి ఉంటారని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సంఘటన గురించి తెలుసుకున్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. మంత్రుల బృందాన్ని మెప్పాడికి వెళ్లాలని ఆయన సూచించారు. తక్షణ బృందాలతో సహా ఏజెన్సీలు అన్నీ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని సీఎంవో అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎప్పటికప్పుడు సీఎం సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రకృతి విపత్తు నేపథ్యంలో కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లు ఏర్పాటు చేశారు. 9656938689, 8086010833 నెంబర్లకు ఏదైనా అత్యవసరం అయితే కాల్ చేయాలని అధికారులు చెబుతున్నారు. వైద్య బృందాలను కూడా కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతాలకు తరలించామని కేరళ సీఎంవో ప్రకటించింది.


Next Story