కేరళ సీపీఎం పార్లమెంటరీ పార్టీ నేతగా, ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ నియమితులయ్యారు. పినరయి విజయన్ తదుపరి ప్రభుత్వంలో మంత్రుల పేర్లను కూడా ప్రకటించింది. శాసన సభ సభాపతి పదవికి ఎంబీ రాజేశ్‌ను, పార్టీ విప్‌గా కేకే శైలజను ఎంపిక చేసింది. పార్లమెంటరీ పార్టీ కార్యదర్శిగా టీపీ రామకృష్ణన్‌ను నియమించింది. సిట్టింగ్ మినిస్టర్లందరూ ఈసారి మంత్రులయ్యే అవకాశాన్ని కోల్పోయారు.
సీపీఎం రాష్ట్ర కమిటీ ప్రకటించిన వివరాల ప్రకారం పినరయి విజయన్ తదుపరి మంత్రివర్గంలో ఎంవీ గోవిందన్, కే రాధాకృష్ణన్, కేఎన్ బాలగోపాల్, పీ రాజీవ్, వీఎన్ వాసవన్, సజి చెరియన్, వీ శివన్ కుట్టి, మహమ్మద్ రియాస్, డాక్టర్ ఆర్ బిందు, వీణా జార్జి, వీ అబ్దుల్ రహమాన్ మంత్రి పదవులను చేపట్టబోతున్నారు. నూతన మంత్రివర్గంలో పెను మార్పులు రాబోతున్నట్లు సీపీఎం ముందుగానే సంకేతాలు ఇచ్చింది. నవ తరానికి పెద్ద పీట వేయనున్నట్లు తెలిపింది. మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్, మాజీ పరిశ్రమల మంత్రి ఈపీ జయరాజన్, మాజీ పీడబ్ల్యూడీ మంత్రి జీ సుధాకరన్ వంటివారిని ఎన్నికల బరి నుంచి తప్పించారు. 62 మంది సభ్యులుగల పార్లమెంటరీ పార్టీలో కొత్త నేతలు అధికంగా ఉన్నారు.
కేరళ రాష్ట్రంలో కరోనా కట్టడిలో ఎంతో మంచి పేరు సంపాదించిన 'టీచర్' కెకె శైలజకు ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఆమె నిర్ణయాలను ప్రధాని నరేంద్ర మోదీ సైతం మెచ్చుకున్నారు. పలు మీడియా సంస్థలు ప్రశంసిస్తూ కథనాలు ప్రచురించాయి. అలాంటి 'టీచర్'ను తాజా కేబినెట్ నుంచి సీఎం పినరయి విజయన్ తప్పించేశారు. కొత్త మంత్రి వర్గంలోకె.కె. శైలజకు చోటివ్వలేదు. పినరయి విజయన్ మే 20న కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే.