దొంగను అయితే రూ.3వేల కోట్లు జేబులో వేసుకునే వాడిని: కేజ్రీవాల్
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అరవింద్ కేజ్రీవాల్.
By Srikanth Gundamalla Published on 24 Sept 2024 6:51 PM ISTహర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అరవింద్ కేజ్రీవాల్. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనను దొంగ అని చూపించేందుకే బీజేపీ అరెస్ట్ చేయించిందని ఆరోపించారు. అయితే.. ఒకవేళ తాను నిజంగా దొంగ అయితే రూ.3వేల కోట్లు జేబులో వేసుకునే వాడిని అని అన్నారు. అవినీతిపరుడైన వ్యక్తి వయో వృద్ధులకు ఉచిత తీర్థయాత్రల పథకాన్ని ప్రవేశపెడుతారా? అని మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
ఢిల్లీకి పదేళ్ల పాటు సీఎంగా ఉండి ప్రజలకు మంచి చేసినందుకే జైల్లో వేశారా అంటూ కేంద్రాన్ని అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేసినందుకా? అన్నారు. ఢిల్లీలో ఒకప్పుడు 7, 8 గంటల విద్యుత్ కోతలు ఉండేవీ.. కానీ ఇప్పుడు తాము నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీ, పంజాబ్‌లో ఉచితంగా విద్యుత్ ఇవ్వడమే నా తప్పా? అన్నారు. తాను బీజేపీ అన్నట్లుగా దొంగనైతే రూ.3,000 కోట్లు జేబులో వేసుకుని ఉండేవాడిని అని వ్యాఖ్యానించారు. పేద ప్రజల కోసం మంచి స్కూళ్లు ఏర్పాటు చేశాననీ... ఇదెంతో ఖర్చుతో కూడుకున్న పని అని కేజ్రీవాల్ చెప్పారు. తనకున్న ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు బీజేపీ తనను జైలుకు పంపిందని కేజ్రీవాల్ ఆరోపించారు.
జైలులో ఉంచడం ద్వారా తనను మానసికంగా, శారీరకంగా బలహీనుడిని చేయాలని వారు అనుకున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తనక జైలులో ఉన్నప్పుడు మందులు ఆపేశారని, పదేళ్లుగా తీసుకుంటున్న ఇన్సులిన్ నిలిపేశారని చెప్పారు. తాను హర్యానా నుంచి వచ్చాననే విషయం వారికి తెలిసి ఉండకపోవచ్చని బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు వేశారు. కేజ్రీవాల్ నిజాయితీపరుడని నమ్మతేనే ఓటు వేయాలని ప్రజలను ఆయన కోరారు.