భర్తను రూ.5 లక్షలకు అమ్మేసుకున్న భార్య

ఒక మహిళ తన భర్తను అతడి ప్రియురాలికే రూ.5లక్షలకు అమ్మేసింది.

By Srikanth Gundamalla
Published on : 21 Oct 2023 7:30 AM IST

karnataka, woman, sells husband, Rs.5 lakhs,

భర్తను రూ.5 లక్షలకు అమ్మేసుకున్న భార్య

గొడవల కారణంగా భార్యభర్తలు విడిపోతున్న సంఘటనలు చాలా చూశాం. కొంతమంది చిన్నచిన్న కారణాలకే విడిపోతుంటే.. ఇంకొందరు వివాహేతర సంబంధాల కారణంగా దూరమవుతున్నారు. అయితే.. విడిపోతున్న సమయంలో కోర్టు తీర్పు భార్యకు భరణం చెల్లించాల్సి ఉంటుందంటూ తీర్పులు వెల్లడిస్తాయి. అలాగే కొన్ని కేసుల్లో భర్తలకు కూడా భరణం చెల్లించడం వంటివి చూశాం. అయితే.. కర్ణాటకలో ఓ భార్య చేసిన పని అందరినీ షాక్‌కు గురి చేసింది.

కర్ణాటకలో జరిగిన ఓ సంఘటన సినిమా కథకు ఏమాత్రం తీసిపోలేదు. ఒక మహిళ తన భర్తను అతడి ప్రియురాలికే రూ.5లక్షలకు అమ్మేసింది. మండ్య సమీపంలోని ఓ గ్రామంలో వెలుగు చూసింది ఈ కథ. ఇటీవల ఒక గృహిణి తన భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉండటం చూసింది. దాంతో.. వారిద్దరినీ నిలదీసింది. పడక గదిలో ఉండగానే పట్టుకోవడంతో వారేమీ బొంకలేకపోయారు. దాంతో.. పంచాయితీ పెద్ద మనుషుల మధ్యకు వెళ్లింది. ఊళ్లో గృహిణి పెద్దమనుషులను పిలిపించి పంచాయితీ పెట్టించింది. తన భర్తను వలలో వేసుకుందనీ.. భర్త కూడా తనని మోసం చేశాడని న్యాయం చేయాలని కోరింది.

ఇక్కడే ఒక ట్విస్ట్‌ పెట్టింది సదురు గృహిణి భర్త ప్రియురాలు. గృహిణికి ఆమె భర్తను అప్పగించాలంటే తనకు అతడు బాకీపడ్డ రూ.5లక్షలు చెల్లించాలని షరతు పెట్టింది. అయితే.. గతంలో తన వద్ద గృహిణి భర్త రూ.5లక్షలు తీసుకున్న విషయాన్ని పంచాయితీలో నిరూపించింది. దాంతో.. సదురు గృహిణి ఇలాంటి భర్త తనకొద్దని చెప్పింది. తనకే రూ.5లక్షలు మనోవర్తి కింద ఇస్తే భర్తను ప్రియురాలికే వదిలేస్తానని చెప్పింది. దానికి ప్రియురాలు కూడా ఒప్పుకుంది. ఒక నెల రోజుల వ్యవధిలో రూ.5లక్షలు మనోవర్తి కింద గృహిణికి చెల్లిస్తానని ప్రియురాలు ఒప్పుకుంది. దాంతో.. భర్త బదిలీ పూర్తయ్యింది. అయితే.. ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాన్ని చూసిన పెద్దలతో పాటు స్థానికులు కూడా షాక్‌ అయ్యారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వార్త స్థానికంగా వైరల్ అవుతోంది.

Next Story