ఆ గుడిలో తామర ఆకుల్లో భోజనం..ఆషాఢ మాసం ప్రత్యేకం
తిమ్మప్ప హరిసేవ ఆదివారం వేలాది మంది భక్తుల మధ్య ఘనంగా జరిగింది.
By Srikanth Gundamalla Published on 11 July 2023 12:08 PM GMTఆ గుడిలో తామర ఆకుల్లో భోజనం..ఆషాఢ మాసం ప్రత్యేకం
కర్ణాటకలోని మండ్యా జిల్లా అబలవాడి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తోపిన తిమ్మప్ప హరిసేవ ఆదివారం వేలాది మంది భక్తుల మధ్య ఘనంగా జరిగింది. ప్రతి సంవత్సరం లాగే లక్ష్మిదేవికి ఇష్టమైన తామర ఆకులో వేలాది మంది భక్తులకు ప్రసాదాలు వడ్డించారు. మాండ్య జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులుభారీగా తరలి వచ్చారు. తిరుమల వెంకటేశ్వరస్వామి తరహాలో తిమ్మప్ప స్వామి మూల విరాట్‌ను అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నాక తామర ఆకుల్లో ప్రసాదం స్వీకరించారు. ప్రభుత్వం తరఫున మంత్రి ఎన్.చెలువరాయ స్వామి వచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
తిమ్మప్పస్వామి ఆలయం చాలా పురాతనమైనది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆ ఆలయంలో ప్రతి ఏడాది ఆషాఢ మాసం మూడో వారంలో తోపు తిమ్మప్పస్వామికి హరిసేవ నిర్వహిస్తుంటారు. భక్తులు కూడా భారీ సంఖ్యలో వచ్చి ఈ వేడుకల్లో పాల్గొంటారు. భారీ క్యూలైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన భోజనాలు చేస్తారు.
హరిసేవ సందర్భంగా ఆలయ సిబ్బంది భారీగా బియ్యాన్ని సేకరిస్తారు. అలా సేకరించిన వస్తువులతోనే అన్నం సహా సాంబార్‌ను తయారు చేస్తారు. హరిసేవలో భాగంగా స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఆ అన్నం, సాంబార్‌ను తామర ఆకులో వడ్డిస్తారు. వేలాది మంది బంతిగా నేలపైనే కూర్చొని తామర ఆకుల్లో స్వామివారి ప్రసాదంగా సాంబార్ అన్నం తింటారు. మాండ్యా జిల్లాలోనే కాదు.. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడకులకు ఎంతో పేరుంది. భక్తులు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వామివారిని దర్శించుకుని.. తామరాకులో ప్రసాదాన్ని స్వీకరిస్తారు.
అబలవాడి గ్రామంలో ఉన్న తిమ్మప్ప స్వామివారి ఆలయానికి 800 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అప్పటి నుంచే హరిసేవ జరుగుతోందని అక్కడి వారు వివరిస్తున్నారు. తామర ఆకుల్లో భోజనం పెట్టడం ఇక్కడి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. చుట్టుపక్కల ఉన్న సరస్సుల నుంచి సుమారు 50వేలకు పైగా తామరాకులను సేకరిస్తారు ఆలయ సిబ్బంది. ఇంత భారీ ఎత్తున భోజనాల కోసం ఏర్పాట్లు చేయడానికి 15 రోజులు ముందు నుంచే సన్నాహాలు చేస్తారు. అయితే ప్రతి ఏడాది ఆషాఢమాసం మూడో వారంలోనే తిమ్మప్ప స్వామివారికి హరిసేవ నిర్వహిస్తారు. తామరాకుల్లో భోజనం పెట్టడం ఇక్కడ ప్రత్యేకం.
తామర ఆకుల్లో భోజనం పెట్టడానికి కారణం ఉందని భక్తులు చెబుతున్నారు. లక్ష్మి కమల ప్రియురాలు. అందుకే తామర ఆకుల్లో ప్రసాదం అందిస్తారని అంటున్నారు. అయితే.. తామర ఆకుల్లో భోజనం చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని చెబుతున్నారు. అంతేకాదు.. స్వామివారికి హరిసేవ చేయడం, తామర ఆకుల్లో భోజనాలు చేయడం ద్వారా పంటలు బాగా పండుతాయని స్థానికులు నమ్ముతున్నారు. అంతేకాదు.. గుడిలో ఇచ్చే మధ్యాహ్న భోజనంలో నెయ్యి కూడా వడ్డిస్తారు. భారీ ఎత్తున జరిగిన ఈ వేడుకులకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.