Karnataka polls: ఎన్నికల విధుల్లో 1.56 లక్షల మంది పోలీసులు
కర్ణాటక రాష్ట్రంలో మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది.
By అంజి Published on 9 May 2023 4:45 AM GMTKarnataka polls: ఎన్నికల విధుల్లో 1.56 లక్షల మంది పోలీసులు
కర్ణాటక రాష్ట్రంలో మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 50 మిలియన్లకు పైగా ఓటర్లు ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1.56 లక్షల మంది పోలీసులను కమిషన్ నియమించింది.
రాష్ట్రంలోని 84,119 మంది పోలీసు అధికారులను డిప్యూట్ చేయగా, మిగిలిన వారు పొరుగు రాష్ట్రాల నుండి రప్పించబడ్డారు. 304 మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ), 991 మంది ఇన్‌స్పెక్టర్లు, 20,601 మంది సబ్-ఇన్‌స్పెక్టర్లు, 650 కంపెనీల సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లను రాష్ట్రంలో పోలింగ్ డ్యూటీ కోసం నియమించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
బెంగళూరులో ఎన్నికల విధులకు 16,000 మంది పోలీసులను నియమించారు. వీరిని 7,916 పోలింగ్ బూత్‌లకు, 1,907 హైపర్ సెన్సిటివ్ పోలింగ్ బూత్‌లకు మోహరించనున్నారు.
పోలింగ్ సందర్భంగా సోమవారం సాయంత్రం నుంచి మద్యం విక్రయాలు బంద్ అయ్యాయి. దీంతో పక్కరాష్ట్రాల నుంచి మద్యం తరలించకుండా అధికారులు ఎక్కడికక్కడ ఫ్లయింగ్‌స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 13వ తేదీన వెలువడనున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలనేది జనరల్ స్థానాలే నిర్ణయించనున్నాయి.