హీరో అయితే.. రాయల్ ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు: కర్ణాటక హోంమంత్రి
కన్నడ నటుడు దర్శన్ కు పోలీస్ స్టేషన్‌లో 'రాయల్ ట్రీట్‌మెంట్' వార్తలను కర్ణాటక హోం మంత్రి ఖండించారు.
By Srikanth Gundamalla
హీరో అయితే.. రాయల్ ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు: కర్ణాటక హోంమంత్రి
కన్నడ నటుడు దర్శన్ తూగుదీప, అతని సహచరులకు పోలీస్ స్టేషన్‌లో 'రాయల్ ట్రీట్‌మెంట్' ఇస్తున్నారని వచ్చిన వార్తలను కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర ఖండించారు. దర్శన్‌కు ఇతర నిందితులకు ఇచ్చే విధంగానే అన్నీ ఇస్తున్నారని, 'బిర్యానీ' వడ్డించడం లేదా అతనికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదని ఆయన అన్నారు.
"అవసరమైన చర్యలు తీసుకోవాలని నేను పోలీసులను ఆదేశిస్తాను.. కానీ వారు స్వేచ్ఛగా విచారించేలా చేయాలి, నిందితులకు బిర్యానీ, రాజభోగాలు ఇవ్వడం పోలీసులకు సాధ్యం కాదు, అది చేయలేదు’’ అని పరమేశ్వర గౌడ విలేకరులతో అన్నారు. దర్శన్ విచారణ జరుగుతున్న అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో, రోడ్లను దిగ్బంధించడం ద్వారా సమీపంలోని ప్రజల రాకపోకలను పరిమితం చేసినట్లు అధికారులు తెలిపారు. పాఠశాల వ్యాన్లు, అంబులెన్స్‌లను కూడా అనుమతించకుండా పోలీసులు ప్రజలకు అసౌకర్యానికి గురిచేస్తున్నారనే వాదనలో ఎలాంటి నిజం లేదని హోం మినిస్టర్ అన్నారు.
'ఛాలెంజింగ్ స్టార్'గా కర్ణాటకలో పేరుగాంచిన దర్శన్.. తన అభిమాని అయిన 33 ఏళ్ల రేణుకాస్వామి హత్యలో భాగమయ్యాడనే ఆరోపణలతో మంగళవారం అరెస్టు చేశారు. చిత్రదుర్గ జిల్లా కి చెందిన రేణుకాస్వామి నటి పవిత్ర గౌడ సోషల్ మీడియా ఖాతాలో అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించాడని, అభ్యంతరకరమైన సందేశాలను పోస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల కారణంగా రేణుకా స్వామి మరణం చోటు చేసుకుంది.