కర్ణాటకలోని గడగ్ జిల్లాలో దళితులకు సెలూన్ షాపుల్లో జుట్టు కత్తిరించడానికి నిరాకరించిన ఘటనకు వ్యతిరేకంగా, ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాజిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శింగటలూరు గ్రామంలో కర్ణాటక రాష్ట్రంలోనే మొట్టమొదటి "ప్రభుత్వ సెలూన్" ను ప్రారంభించింది.
శింగటలూరు గ్రామంలో కొద్ది వారాల క్రితం ఓ సెలూన్ యజమాని దళితులకు హెయిర్ కట్ చేయడానికి నిరాకరించాడు. స్థానిక అధికారులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినకపోవడంతో, ఆ షాపుకు అధికారులు నోటీసులు జారీ చేశారు. దానికి మద్దతుగా, గ్రామంలోని మిగతా బార్బర్ షాపులన్నీ కూడా మూసివేసి దళితులను బహిష్కరించారు. అయితే పంచాయతీ, దళిత సంఘాలు కలిసి పక్క గ్రామానికి చెందిన బసవరాజ్ హడపద అనే వ్యక్తికి ఈ ప్రభుత్వ షాపును కేటాయించాయి. అధికారులు, గ్రామస్తుల సమక్షంలో ఈ ప్రభుత్వ బార్బర్ షాపును లాంఛనంగా ప్రారంభించారు.