Karnakata: గణేష్ ఊరేగింపులో ఘర్షణ.. దుకాణాలకు నిప్పు, పలువురికి గాయాలు
కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.
By Srikanth Gundamalla Published on 12 Sept 2024 7:43 AM ISTకర్ణాటకలోని మాండ్యా జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. నాగమంగళ పట్టణంలో వినాయకుడి ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రాథమిక సమాచారం మేరకు బదరికొప్పలు గ్రామానికి చెందిన కొందరు గణపతి విగ్రహ నిమజ్జనం కోసం ఊరేగింపుగా వెళ్తున్నారు. ఊరేగింపు నాగమంగళలోని ప్రధాన రహదారిపై వెళుతుండగా, మసీదు దగ్గర నుండి వారిపై రాళ్లు విసిరారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. కొందరు వ్యక్తులు దుకాణాలను ధ్వంసం చేసి రెండు వాహనాలకు నిప్పు పెట్టారు.
ఇక ఈ సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసులు ఆ ప్రాంతంలో సెక్షన్ 163 విధించారు. ఎవరూ బయటకు రావొద్దని సూచించారు. కొంత విధ్వంసం, ఉద్రిక్త పరిస్థితుల తర్వాత శాంతించిన వాతావరణం కనిపించింది. అయితే.. ఈ సంఘటనపై ఆగ్రహించిన హిందూ సంఘాలు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు.
ఊరేగింపు మసీదు సమీపంలోకి వచ్చినప్పుడు, వారు కదలకుండా ఎక్కువ సమయం గడిపారని మాండ్య పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) మల్లికార్జున్ బాలదండి తెలిపారు. దీనిపై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.. పోలీసులు జోక్యం చేసుకుని గుంపును చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. పెద్ద సంఖ్యలో జనం రావడంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేయవలసి వచ్చింది. ఇతర వర్గాలకు చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో గుమిగూడి రోడ్డుపక్కన ఉన్న కొన్ని బైక్‌లు, దుకాణాలను తగులబెట్టారు’’ అని ఎస్పీ తెలిపారు.
ఇక ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఎస్పీ బాలదండి తెలిపారు. 'మాకు తగినంత పోలీసు బలగాలు ఉన్నాయి. అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. కొద్దిమందికి మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి.' అని ఎస్పీ వెల్లడించారు.