మ‌రోసారి ఆర్టీసీ స‌మ్మె.. రాజీకి వ‌చ్చే ప్ర‌స‌క్తే లేద‌న్న ప్ర‌భుత్వం.. ఆందోళ‌న‌లో ప్ర‌జ‌లు

Karnataka Bus Strike from Today.త‌మ డిమాండ్ల సాధ‌న కోసం ఆర్టీసీ ఉద్యోగులు బుధ‌వారం స‌మ్మెబాట ప‌ట్టారు. దీంతో క‌ర్ణాట‌క రాష్ట్రంలో ఆర్టీసీ బ‌స్సులు నిలిచిపోయాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 April 2021 6:07 AM GMT
KSRTC strike

ప్ర‌పంచాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి అత‌లాకుత‌లం చేసింది. క‌రోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చింది అనుకుంటున్న త‌రుణంలోనే మ‌న‌దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌జ‌లు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్న త‌రుణంలో సామాన్యుల‌పై ఆర్టీసీ స‌మ్మె రూపంలో మ‌రో పిడుగు పడింది. త‌మ డిమాండ్ల సాధ‌న కోసం ఆర్టీసీ ఉద్యోగులు బుధ‌వారం స‌మ్మెబాట ప‌ట్టారు. దీంతో క‌ర్ణాట‌క రాష్ట్రంలో ఆర్టీసీ బ‌స్సులు నిలిచిపోయాయి. బ‌స్సులు నిలిచిపోవ‌డంతో నేడు జ‌ర‌గాల్సిన ప‌లు ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేశారు.

త‌మ‌కు జీతాలు చెల్లించ‌డం లేదంటూ.. బస్సు డ్రైవ‌ర్లు నిర‌వ‌ధిక స‌మ్మెకు పిలుపునిచ్చారు. కార్మికుల స‌మ్మె నేప‌థ్యంలో ముఖ్యమంత్రి నివాస కార్యాలయం కృష్ణాలో మంగ‌ళ‌వారం సీఎం యడియూరప్ప, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవికుమార్, పోలీస్‌ కమిషనర్‌ కమల్‌పంత్, బీఎంటీసీ అధ్యక్షుడు నందీశ్‌రెడ్డి, డైరెక్టర్లు శిఖా, శివయోగికళసద్, రవాణాశాఖ కమిషనర్‌ శివకుమార్, వాయువ్య, ఈశాన్యతో సహా 4 ఆర్టీసీ మండళ్ల డైరెక్టర్లతో సమావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో కార్మికుల‌తో రాజీకి వ‌చ్చే ప్ర‌స‌క్తే లేద‌ని య‌డ్డీ స‌ర్కారు తేల్చి చెప్పింది. ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌లిగించ‌డం లేదా ప్ర‌భుత్వ ఆస్తుల‌ను ధ్వంసం చేస్తే అలాంటి వారిపై ఎస్మా చ‌ట్ట ప్ర‌మోగం త‌ప్ప‌ద‌ని స్ప‌ష్టం చేసింది. ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థస్తంబించ‌కుండా ఉండేందుకు కేఎస్ఆర్టీసీ ప్రైవేటు బ‌స్సుల‌కు తాత్కాలికంగా అనుమ‌తినిచ్చింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ వైఖ‌రిని నిర‌సిస్తూ ఆర్టీసీ ఉద్యోగులు బుధ‌వారం నుంచి స‌మ్మెబాట ప‌ట్టారు.


Next Story