కర్ణాటక అసెంబ్లీలో 10 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్, స్పీకర్‌పై అవిశ్వాసానికి నోటీసు

కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు రసాభాసగా కొనసాగాయి. 10 బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు స్పీకర్.

By Srikanth Gundamalla  Published on  19 July 2023 3:11 PM GMT
Karnataka, Assembly, BJP MLAs Suspension,

కర్ణాటక అసెంబ్లీలో 10 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్, స్పీకర్‌పై అవిశ్వాసానికి నోటీసు

కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు రసాభాసగా కొనసాగాయి. ఐఏఎస్‌ అధికారులను కర్ణాటక ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీలో నిరసనలు చేపట్టారు. దాంతో.. సభలో ఆందోళన వాతావరణం నెలకొంది. స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టిన బీజేపీ ఎమ్మెల్యేలు నానా హంగామా చేశారు. కాగితాలను చింపి ఏకంగా స్పీకర్‌ కుర్చీపైకి విసిరేశారు. బీజేపీ ఎమ్మెల్యేల తీరుతో స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సిఫార్సు మేరకు 10 బీజేపీ ఎమ్మెల్యేలను ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్‌ చేస్తూ ప్రకటన చేశారు.

బీజేపీకి చెందిన డాక్టర్ సీఎన్ ఆశ్వత్ నారాయణ్, వి.సునీల్ కుమార్, ఆర్.ఆశోక్, అరగ జ్ఞానేంద్ర, వేదవ్యాస్ కామత్, యశ్ పాల్ సువర్ణ, అరవింద్ బెల్లాడ్, దేవరాజ్ మునిరాజ్, ఉమానాథ్ కొట్యాన్, భరత్ శెట్టి పది మంది ఎమ్మెల్యే సస్పెండ్ అయిన జాబితాలో ఉన్నారు. వీరిని మార్షల్స్ సహాయంతో సభ బయటకు తరలించారు. సస్పెన్షన్ అనంతరం సుదురు ఎమ్మెల్యేలో అసెంబ్లీ ఆవరణలోనే ఆందోళనకు దిగారు. అంతకు ముందు కూడా సభలో తీవ్ర ఆందోళన కొనసాగింది. గందరగోళం మధ్యే ప్రభుత్వం ఐదు బిల్లులకు ఆమోదం తెలిపింది. ఎలాంటి చర్చ లేకుండానే ఐదు బిల్లులకు కర్ణాటక అసెంబ్లీలో ఆమోదం లభించింది..

సభ్యుల సస్పెన్షన్‌ను నిరసిస్తూ విధానసౌధ బయట మాజీ సీఎం బొమ్మైతో సహా పలువురు నిరసన చేపట్టగా.. వారందర్నీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో స్పీకర్‌ యూటీ ఖాదెర్‌పై అవిశ్వాస తీర్మానానికి భాజపా, జేడీఎస్‌ పార్టీలు సంయుక్తంగా నోటీసులు ఇచ్చాయి. కాగా.. కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జులై 3న ప్రారంభం అయ్యాయి. ఈనెల 21 వరకు కొనసాగనున్నాయి.


Next Story