నువ్వు నా గర్ల్‌ఫ్రెండ్‌గా మారితే గణితంలో పాస్ చేస్తా
Kanpur polytechnic student gets girlfriend offer.గణితం సబ్జెక్టులో ఓ యువతి ఫెయిలైంది.
By తోట వంశీ కుమార్ Published on 21 Dec 2022 9:58 AM ISTగణితం సబ్జెక్టులో ఓ యువతి ఫెయిలైంది. పరీక్షబాగానే రాసినా ఫెయిల్ కావడంతో ఆ యువతి రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఆ యువతికి ఓ విచిత్రమైన ప్రతిపాదన వచ్చింది. నువ్వు నా గర్ల్‌ఫ్రెండ్‌గా మారితే నిన్ను పాస్ చేస్తా అంటూ ఆ యువతిని ప్రలోభ పెట్టపోయాడు. అంతేకాదు రూ.5వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇందుకు ఆ యువతి కుదరదు అని చెప్పింది. దీంతో అతడు వివిధ నెంబర్ల నుంచి ఫోన్ చేస్తూ, మెసేజ్‌లు చేస్తూ విసిగిస్తున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
మహారాజ్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో బాధిత యువతి నివసిస్తోంది. కాన్పూర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతోంది. ఇటీవల వచ్చిన ఫలితాల్లో గణితం సబ్జెక్టులో 11 మార్కులే రావడంతో ఫెయిల్ అయింది. తాను పరీక్ష మంచిగానే రాసానని బావించిన యువతి రీ కౌంటింగ్‌కు ఫీజు కట్టింది. అయితే.. కొద్ది రోజులకు ఆ యువతి ఫోన్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్, మెసేజ్ వచ్చింది.
నువ్వు పరీక్షల్లో పాస్ కావాలంటే రూ.5వేలు ఇవ్వు. అంతేకాదు.. నువ్వు నా గర్ల్‌ఫ్రెండ్‌గా మారాలని చెప్పాడు. దీనికి ఆ యువతి నిరాకరించింది. రీకౌంటింగ్ ఫలితాలు చూసుకున్న యువతి ఖంగుతింది. మళ్లీ ఫెయిల్ అయింది. కొసమెరుపు ఏమిటంటే మొదట 11 మార్కులు రాగా.. రీ కౌంటింగ్‌లో సున్నా మార్కులు వచ్చాయి. దీంతో తనకు ఫోన్ చేసిన వ్యక్తే ఇలా చేశాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.