కమల్ హాసన్.. తమిళనాడు రాజకీయాలలో తన మక్కల్ నీది మయ్యం పార్టీతో మార్పును తీసుకుని రావాలని అనుకున్నారు. అందుకే ఎన్నికల ప్రచారంలో కూడా ఒక్క రూపాయి కూడా పంచనని చెప్పేశారు. చెప్పినట్లుగానే కమల్ హాసన్ కానీ.. ఆయన నిలబెట్టిన అభ్యర్థులు కానీ డబ్బు పంచలేదు. దీంతో కమల్ హాసన్ తో సహా అందరూ ఓటమిపాలయ్యారు.
కోయంబత్తూరు సౌత్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఎంఎన్ఎం పార్టీ అధినేత కమల్ హాసన్ ఓటమిపాలయ్యారు. బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో ఆయన పరాజయం చవిచూశారు. కొన్ని రౌండ్ల పాటు కమల్ ఆధిక్యం కొనసాగింది. అయితే చివరి రౌండ్లలో అనూహ్యరీతిలో వనతి శ్రీనివాసన్ పుంజుకుని కమల్ హాసన్ పై చిరస్మరణీయ విజయం సాధించారు. కోయంబత్తూరు దక్షిణం నుంచి బరిలోకి దిగిన కమల్, బీజేపీ అభ్యర్థి వానతి చేతిలో దాదాపు 1,500 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 142 స్థానాల్లో పోటీ చేసిన కమల్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యమ్, ఒక్కటంటే ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. సరికొత్త రాజకీయ వాతావరణాన్ని సృష్టించడమే తన లక్ష్యమని ముందే ప్రకటించిన కమల్, అన్న మాటను చేసి చూపారు. విలువలకు కట్టుబడిన వ్యక్తిగా గెలిచిన కమల్.. ఓట్లను పొందడంలో మాత్రం ఓడిపోయారు. కమల్ సహా ఎంఎన్ఎం పార్టీ అభ్యర్థులంతా ఓడిపోయారు. తమిళనాడు ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బు, మద్యం పంపిణీ జరిపారు. చాలా ప్రాంతాల్లో ఇవే విజయాలను కూడా అందించాయి. ఇక స్టాలిన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతూ ఉన్నాడు.