రెండు చోట్ల పోటీ చేయబోతున్న కమల్.. మంచి ప్లానింగే..?
Kamal haasan is may contest in two places.కమల్ హాసన్ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.
By తోట వంశీ కుమార్
తమిళనాడు ఎన్నికలకు సంబంధించిన కీలక ప్రకటన ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం చేసింది. ఇప్పటికే పార్టీలు తమదైన శైలిలో దూసుకుపోతూ ఉన్నాయి. మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌హాసన్ కూడా ఈ ఎన్నికల్లో తన సత్తా చూపించడానికి సిద్ధమవుతున్నారు. తమ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నా కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని తానేనని చెప్పేసిన కమల్ హాసన్ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకు తగ్గ ప్లానింగ్ కూడా లోకనాయకుడు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎంతో మంది నాయకులు ఇలా రెండు చోట్ల పోటీ చేసిన సంగతి తెలిసిందే..! ఇప్పుడు కమల్ హాసన్ కూడా అదే దారిలో వెళుతూ ఉన్నారు. ఆలందూర్, కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
ఎంఎన్‌ఎం పార్టీ 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిగా 39 స్థానాల్లో పోటీచేసి ఘోరమైన ఓటమిని చవిచూసింది. కేవలం నాలుగు నియోజకవర్గాల్లో మాత్రమే ఆ పార్టీకి లక్షకు పైగా ఓట్లు వచ్చాయి. చెన్నై సౌత్, చెన్నై నార్త్, చెన్నై సెంట్రల్, కోయంబత్తూర్ పార్లమెంటు నియోజకవర్గాల్లో మాత్రమే ఆ పార్టీకి 10 శాతం పైగా ఓట్లు వచ్చాయి. శ్రీపెరుంబుదూర్ నియోజకవర్గంలో 9.63 శాతం ఓట్లు రాగా, అతి తక్కువగా కన్నియాకుమారి నియోజకవర్గంలో ఆ పార్టీకి కేవలం 0.82 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ గెలుచేందుకు అవకాశాలున్న నియోజకవర్గాలలో ఆలందూర్, కోయంబత్తూర్ దక్షిణం శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయని భావిస్తున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో శ్రీపెరుంబుదూర్ నియోజక వర్గంలో ఉన్న అలందూర్ శాసనసభ నియోజకవర్గంలో ఎంఎన్‌ఎంకు 1.35 లక్షల ఓట్లు, కోయంబత్తూర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కోయంబత్తూర్ దక్షిణంలో 1.45 లక్షల ఓట్లు వచ్చాయి. పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన ఈ రెండు నియోజకవర్గాల్లో పోటీచేస్తే విజయం వరించవచ్చని భావిస్తున్న కమల్.. ఈ రెండు స్థానాల్లో పోటీ చేయొచ్చు. ఇక దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.