తాజాగా ఓ న్యాయమూర్తి లేటు వయసులో తన ఫ్రెండ్, బీజేపీ నాయకురాలిని పెళ్లి చేసుకోని చర్చనీయాంశమయ్యాడు. ఈ ఆసక్తికర ప్రేమ పెళ్లి జార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాలో జరిగింది. ఓ మహిళా న్యాయవాది, న్యాయమూర్తి మొదట ప్రేమించుకుని.. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. న్యాయమూర్తి శివపాల్ సింగ్ 59 ఏళ్ల వయసులో తన స్నేహితురాలు, అయిన 50 ఏళ్ల న్యాయవాది నూతన్ తివారీని ఆయన మనువాడారు. దాణా కుంభకోణంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు శిక్ష విధించడంతో న్యాయమూర్తి శివపాల్ సింగ్ పేరు వెలుగులోకి వచ్చింది.
న్యాయమూర్తి రెండో పెళ్లి వార్త ఇప్పుడు చర్చనీయాంశమైంది. శివపాల్ సింగ్ మరో ఆరు నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. ఇంతలోనే ఇలా రెండో పెళ్లి చేసుకోవడం గమనార్హం. నూతన్ తివారీ జార్ఖండ్‌లో చురుకైన బీజేపీ నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. ఈ వివాహానికి గొడ్డాకు చెందిన ఓ న్యాయవాది సాక్షిగా మారారు. జడ్జి శివపాల్ సింగ్ భార్య రెండు దశాబ్దాల క్రితమే చనిపోయింది. గొడ్డాకు చెందిన బీజేపీ నేత, బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది నూతన్ తివారీ భర్త కూడా కొన్నేళ్ల క్రితం కన్నుమూశారు.
మంచి విషయమేమిటంటే వారిద్దరూ తమ కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. న్యాయమూర్తి శివపాల్ సింగ్‌కు ఇద్దరు కుమారులు, నూతన్ తివారీకి ఒక కుమారుడు కూడా ఉన్నారు. శివపాల్ సింగ్ 3 సంవత్సరాలు గొడ్డాలో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. బార్, బెంచ్‌ల మధ్య ఈ ప్రేమ చిగురించినప్పుడు తోటి లాయర్లు కూడా ఆ వార్తలు నమ్మలేదు. ఇప్పుడు న్యాయవాది, న్యాయమూర్తి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లిపై తోటి న్యాయవాదులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.